భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
మన బస్తి – మన బడి కార్యక్రమము కింద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేవిధంగా మౌలిక వసతులు కల్పించి ప్రతి ఒక్కరికి డిజిటల్ క్లాసుల ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తుందని, తల్లిదండ్రులందరు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జంగేడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన పాఠశాల కరపత్ర ఆవిష్కరణలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా జంగేడు పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని, ప్రతిసంవత్సరం జంగేడు పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటి బాసరకు విద్యార్థులు ఎంపికవుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రభుత్వం విద్యాభివద్ధికి కల్పిస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, ఎన్‌ఎంఎంఎస్, ఉచిత పాఠ్యపుస్తకాలు,ఈ సంవత్సరం నుంచి ఉచిత నోటు పుస్తకాలు కూడా అందిస్తున్నారని అన్నారు. బాలికలకు కరాటేలో శిక్షణ , కోడింగ్‌లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారని అన్నారు. పోషక విలువలతో కూడిన భోజనం లాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి , తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిభావంతులుగా రూపొందడానికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ బర్ర రమేష్, మాజీ ఎంపీపీ రఘుపతిరావు, మేకల సంపత్ గారు ఉపాధ్యాయులు బాలశౌ రెడ్డి, సుభాకర్ రెడ్డి,హనీఫ్ ,బాబురావు, రామ్ ధన్ ,షరీఫ్, రవీందర్, విజయలక్ష్మి, వాణి, ముస్తాక్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.