నాణ్యమైన విద్య అందట్లే!

Quality education Just like that!– నిరుద్యోగానికి అదీ ఓ కారణమే : ఏఎస్‌ఈఆర్‌ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో నాణ్యమైన విద్య లభించడం లేదని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ (ఏఎస్‌ఈఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు ఎంత మంది విద్యను అభ్యసిస్తున్నారు, వారి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై ఏఎస్‌ఈఆర్‌ 2005లో అధ్యయనం ప్రారంభించింది. ఇప్పటి వరకూ మూడు నివేదికలు వెలువడ్డాయి. తాజాగా గత సంవత్సరం విడుదలైన నివేదిక పాఠశాల విద్యపై పెదవి విరిచింది. 14-18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థుల్లో విద్యకు సంబంధించిన పునాది ఇప్పటికీ బలహీనంగానే ఉన్నదని తేల్చింది. ఉద్యోగాలలో చేరే సమయంలో కూడా వీరికి ప్రాథమిక అవగాహన కొరవడిందని తెలిపింది.
తాజా నివేదిక ప్రకారం…14-18 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో కేవలం 73.6% మంది మాత్రమే స్టాండర్డ్‌-2 స్థాయి పుస్తకాన్ని చదవగలుగుతున్నారు. గణితంలో కేవలం 45% మందికే ప్రాథమిక నైపుణ్యం ఉంది. మిగిలిన వారి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నదని నివేదిక వివరించింది. బలమైన పునాది లేకపోవడంతో యువత సరైన ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మానవాభివృద్ధిలో విద్యకు ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక హోదాను మెరుగుపరచుకోవాలంటే తప్పనిసరిగా విద్యావంతులై ఉండాలి. పేదరికాన్ని నిర్మూలించడంలో విద్య సహాయకారిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు విద్యకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే క్షేత్ర స్థాయిలో అలా జరగడం లేదు. 2022లో విడుదలైన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం నిరక్షరాస్యుల్లో, ప్రాథమిక స్థాయి వరకూ చదువుకున్న వారిలో నిరుద్యోగ రేటు వరుసగా 0.4శాతం, 1.0శాతంగా ఉంది. సెకండరీ స్థాయి, ఆ పైన విద్యను అభ్యసించిన వారిలో నిరుద్యోగ రేటు 8.6శాతంగా ఉంది. విద్యా వంతు లైన వారందరికీ ఉద్యోగాలు లభించడం లేదు. పట్టభద్రుల్లో 45శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారని మెర్సర్‌ మెటిల్‌ సంస్థ రూపొందించిన నివేదిక తెలిపింది. భారత్‌లో విద్యనభ్యసించి పట్టభద్రులైన వారిలో నైపుణ్యం పరి మితంగా ఉండడమో లేదా పూర్తిగా లేకపోవడమో జరుగుతోందని గత సంవత్స రం ఏప్రిల్‌ లో విడుదలైన బ్లూమ్‌బర్గ్‌ నివేదిక నిగ్గుతేల్చింది. మరోవైపు దేశంలో ఆర్థిక వృద్ధి జరుగుతున్నప్పటికీ అది ఉద్యోగాలను సృష్టించడం లేదు. దీనికి కారణం విద్యావం తుల్లో నైపుణ్యం కొరవడడమే. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమే మంటే ఉన్నత విద్యలో ఏదైనా ఒక నిర్దిష్టమైన సబ్జెక్టులో డిగ్రీ సంపా దించిన వ్యక్తికి ఆ చదువుతో సంబంధం ఉన్న ఉద్యోగం లభించడం లేదు. దేశ ఆర్థికాభివృద్ధికి విద్యా రంగం ఇతోధికంగా సాయపడుతోంది. దేశంలో విద్యా రంగం అంచనా విలువ 11,700 కోట్ల డాలర్లు. ఈ విలువ 2025 నాటికి 22,500 కోట్ల డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. విద్యా రంగం ఇంతగా పురోభివృద్ధి చెందుతున్నప్పటికీ అనేక మంది యువతీ యువకులకు ఉద్యోగాలు లభించడం కష్టంగా ఉంది. a