ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యని అందించాలని జిల్లా డీఎస్పీ అధ్యక్షులు గణేష్ మహరాజ్ అన్నారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90% పైన పేద, మధ్యతరగతి వర్గాలైన బీసీ/ఎస్సి,ఎస్టీ, ఈబీసి ప్రజలు ఉన్నారని అంటే దాదాపు ఒక కోటి కుటుంబాలు ఉన్నాయన్నారు. నేడు వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు. ఈ ‘5’ సమస్యలను పరిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రజలంతా సుఖ: సంతోషాలతో, శాంతి, సామరస్యాలతో జీవిస్తారన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ,ప్రాణాలను కాపాడాలన్నారు. ప్రతీ గ్రామంలో ‘ఆధునిక హాస్పిటల్’ నిర్మించాలన్నారు. ప్రజలందరికీ చేసుకోవడానికి వారి, వారి అర్హతలను బట్టి ఉపాధిని అందించి చేతినిండా గౌరవప్రదమైన పనిని కల్పించాలి, తద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచాలన్నారు. అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో ఒక ఎకరం వ్యవసాయ భూమిని, 200 గజాల స్థలంలో నాలుగు గదుల ఇల్లుని నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఈ ‘5’ పథకాలకు “ఫూలే, అంబేడ్కర్, సాహు మహారాజ్, కాన్షిరం” లపేర్లు పెట్టి ప్రభుత్వం పకడ్భందీగా అమలు చేసి రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలుగా బ్రతుకుతున్న ప్రజల జీవితాలలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మార్పుని తీసుకురావాలని కోరారు. ఈ 5 డిమాండ్లను పరిష్కరించడం ద్వారా జిల్లాలో కూడా 90 శాతం పేద, మధ్యతరగతి వర్గాలైన ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కమిటీ సభ్యులు అన్నెల, అడెల్లు చీటి వెంకటేష్, రామ్ చందర్, నవీన్, సాయికుమార్, విను కుమార్, ప్రజ్ఞాన్, అంజన్, రవి, రాజేశ్వర్ పాల్గొన్నారు.