పావులుగా ఈడీ,సీబీఐ,ఐటీ సంస్థలు

పావులుగా ఈడీ,సీబీఐ,ఐటీ సంస్థలు– బీజేపీ పాలనలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం : మంత్రి ఉత్తమ్‌ విమర్శ
– మీడియా సంస్థలనూ బెదిరించారని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాష్ట్ర సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేండ్లుగా ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్ర వారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌కు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధారాలు, చార్జిషీట్‌, విచారణ లేకుండానే ప్రతిపక్ష నేతలు జైల్లో పెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రులు, మంత్రుల స్థాయి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్యులకు దిక్కెవరని ప్రశ్నించారు. విపక్షాలనే కాకుండా మీడియా సంస్థలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, నిలదీసినా ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ఉసిగొల్పి బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్‌ పెట్టి పరిస్థితి ఎలా ఉందో వివరించారని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, వాక్‌స్వాతంత్య్రం దెబ్బతిన్నాయని చెప్పారు. ఆర్థిక విధానాల్లోనూ మోడీ సర్కారు విఫలమైంద న్నారు. 70 ఏండ్లల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారనీ, కానీ వారు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్లసాగు చట్టాలు తెచ్చారని అభిప్రాయపడ్డారు. కొన్ని నెలలపాటు రైతులు తీవ్ర ఆందోళన చేయడమేగాక, అనేక మంది రైతులు తమ ప్రాణాలను బలిదానం చేశాకే వాటిని రద్దు చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, భర్తీ చేయకుండా బీజేపీ నిరుద్యోగులకు అన్యాయం చేసిందని తెలిపారు. అగ్నివీర్‌ పథకం దేశ రక్షణకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. గతంలో ఏ ప్రధాని కూడా మోదీలా దిగజారి మాట్లాడలేదని అభిప్రాయపడ్డారు. పదేండ్లల్లో ఏం చేశారో చెప్పడం లేదనీ, మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో కూడా చెప్పకుండా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. మోడీ రాష్ట్రాలకు ఇచ్చిందేమీ లేదన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య బుల్లెట్‌ రైలు ఉండాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరినా మోడీ సర్కారు పట్టించుకోలేదని తెలిపారు. బీజేపీ నేతలకు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత కూడా లేదని వ్యాఖ్యానించారు.