– మాజీ డీసీపీ ఇస్తున్న సమాచారంతో ఆ దిశగా స్పెషల్ టీమ్ ఆరా
– ఆరుకు పైగా జిల్లాల్లో ఫోన్ ట్యాపింగుల నిర్వహణ.. బెదిరింపులు
– ఐదో రోజు విచారణలో వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో దుమారం రేపిన రాజకీయ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడైన నగర టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు నోట పొలిటికల్ లింకుల సమాచారం ఒకటొకటిగా దర్యాప్తు అధికారులు వెలుగు చూస్తున్నట్టు తెలిసింది. విచారణలో భాగంగా ఏడ్రోజుల పాటు రాధాకిషన్‌రావును కస్టడీలోకి తీసుకున్న స్పెషల్ టీమ్ అధికారులు సోమవారం ఐదో రోజు సుదీర్ఘంగా ఆయనను ప్రశ్నించారని తెలిసింది. ఈ సందర్భంలోనే ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు ఇచ్చిన ఆదేశాల మేరకే ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడ్డామని తెలిపిన రాధాకిషన్‌రావు..కొన్ని సందర్భాల్లో తమకు ఆదేశాలిచ్చిన కొందరు బీఆర్‌ఎస్ పొలిటికల్ బాస్‌ల పేర్లను కూడా అన్యాపదేశంగా వెల్లడించినట్టు తెలుస్తున్నది. కొన్ని సార్లు పేర్లు చెప్పి, మరికొన్నిసార్లు వాళ్లు కాదంటూ తప్పుకునే ప్రయత్నం చేసినట్టు కూడా తెలిసింది. దీంతో రాధాకిషన్‌రావు నోట వెలువడ్డ పొలిటికల్ బాస్‌ల లింకులు ఈ కేసుకు ఏ మేరకు ఉన్నాయనే విషయమై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీమ్ అధికారులు క్షుణ్ణంగా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. రాధాకిషన్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌తో పాటు కొందరు ప్రముఖులను బెదిరించి డబ్బులు వసూలు చేయటం వంటి కార్యకలాపాలు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ మొదలైన జిల్లాల్లో కొనసాగినట్టు దర్యాప్తులో వెలుగు చూసింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని నగర టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసి డబ్బులు వసూలు చేయటం.. మరో ఘటనలో నల్లగొండలో ఒక ప్రముఖుడిని బెదిరించి డబ్బులు దండుకోవటం వంటి వివరాలు కూడా దర్యాప్తులో బయటపడ్డట్టు తెలిసింది. అలాగే, కూకట్‌పల్లికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఒకరిని బెదిరించి, అక్రమంగా ఒక ఫ్లాట్‌ను రాధాకిషన్‌రావు రాయించుకున్న విషయం కూడా విచారణలో బయటపడింది. ఈ విషయమై ఇప్పటికే సదరు బాధిత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కేసును కూడా నమోదైంది.
ఎస్‌ఐబీ కార్యాలయంలో 17 కంప్యూటర్లలో నిక్షిప్తమైన ఫోన్‌ట్యాపింగ్ సమాచారాన్ని ధ్వంసం చేయించటంలో రాధాకిషన్‌రావు పాత్ర కూడా ఉన్నట్టు అంగీకరించారని తెలిసింది. ఇవే కంప్యూటర్లలో ఎస్‌ఐబీకి చెందిన మావోయిస్టుల కీలక సమాచారం కూడా చాలా వరకు ఉన్నట్టు తాజాగా తేలటంతో ఆ సమాచారం కూడా ధ్వంసం కావటం పట్ల ఉన్నతాధికారులు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఐబీకి చెందిన మరో నలుగురు కానిస్టేబుళ్లను కూడా స్పెషల్‌టీం అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.