నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుడు, నగర టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఏడ్రోజుల పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. దీంతో పంజాగుట్ట స్పెషల్ టీం పోలీసులు రాధాకిషన్‌రావును నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆయనను పంజాగుట్ట స్పెషల్ టీం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఈ ఏడు రోజుల రాధాకిషన్‌రావు విచారణలో ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి వెల్లడైన కీలక అంశాలను క్రోడీకరించిన దర్యాప్తు అధికారులు.. వాటి ఆధారంగా మరికొందరు ఎస్‌ఐబీకి చెందిన పోలీసు అధికారులను విచారించటానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ప్రభాకర్‌రావును విచారించటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆయనను అమెరికా నుంచి తీసుకురావటానికి మార్గం సుగమమవుతుందో అనే కోణంలో న్యాయ నిపుణులతో స్పెషల్ టీం అధికారులు చర్చిస్తున్నట్టు తెలిసింది. రాధాకిషన్‌రావు వెల్లడించిన అంశాలపై తగిన ఆధారాలను కూడా అధికారులు సేకరిస్తున్నట్టు సమాచారం. ఫోన్‌ట్యాపింగ్‌తో పాటు రాధాకిషన్‌ద్వారా వేధింపులకు గురై.. డబ్బులను పోగొట్టుకున్న బాధితుల నుంచి కూడా స్పెషల్ టీం అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అలాగే, మరో నలుగురు కానిస్టేబుళ్ల విచారణ కూడా కొనసాగుతున్నట్టు తెలిసింది.