నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సెక్యూరిటీలో సమూల మార్పులను చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిసెంబర్ ఏడో తేదీన బాధ్యతలు స్వీకరించాక కొంత కాలం పాటు ఆయనకు పాత సెక్యూరిటీని రాష్ట్ర ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగం అధికారులు కొనసాగించారు. భవిష్యత్తులో పాత సెక్యూరిటీ కారణంగా సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయనే అనుమానంతో ఆయన భద్రతా విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మొదటి అడుగుగా ముఖ్యమంత్రి ప్రధాన భద్రతా అధికారి(సీఎస్‌ఓ)గా నార్కోటిక్ సెల్ విభాగం ఎస్పీ గుమ్మి చక్రవర్తిని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రిని అనుసరించే సెక్యూరిటీ సిబ్బందిని (ఇన్‌స్పెక్టర్లు మొదలుకొని కానిస్టేబుళ్ల స్థాయి వరకు) కూడా బదిలీ చేసి వారి స్థానాల్లో కొత్తవారిని నియమించినట్టు సమాచారం. అంతేగాక, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో సీఎం సెక్యూరిటీని పర్యవేక్షించే మరికొందరు అధికారులను కూడా బదిలీ చేస్తున్నట్టు తెలిసింది. సీఎం నివాసంతో పాటు సచివాలయంలోని సీఎం కార్యాలయం వద్ద కూడా పాత సెక్యూరిటీ సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో సీఎం కాన్వాయిలో వాడే రెండు ల్యాండ్ క్రూజర్ వాహనాలతో పాటు మరో నాలుగు ఫార్చ్యూనర్ వాహనాలకు ఇదివరకు ఉన్న తెలుపు, సిల్వర్ రంగులను తీసేసి పూర్తిగా నలుపు రంగులోకి మార్చారు. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో కఠినంగా శిక్షణ పొందిన వారిని నియమిస్తున్నట్టు తెలిసింది.