‘రాగిజావ’ ముచ్చటింతేనా?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాగిజావ పంపిణీ కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. జూన్‌ నెలలో రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన విద్యా దినోత్సవం రోజున రాగిజావ కార్యక్రమాన్ని ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభి ంచింది. జూలై నెల నుంచి అన్ని బడుల్లో అమలు చేస్తామని ప్రకటించింది. ఈమేరకు అన్ని జావ తయారీ కోసం పాఠశాలలకు రాగిపిండి, బెల్లం ప్యాకెట్లు సరఫరా కాకపోవడంతో పంపిణీ వాయిదా పడింది. దీంతో ఎంతో ఆశగా ఎదురు చూసిన లక్షలాది మంది పిల్లలకు నిరాశే ఎదురైంది. ఇప్పటికే దాదాపు అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. అయినప్ప టికీ విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడు తున్నారని సర్కార్‌ గుర్తించింది. ఒకటినుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఉదయం వేళలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో విద్యార్ధికి 10గ్రాముల జావలో మరో 10గ్రాములు బెల్లంపొడి కలిపి ఇవ్వాల్సి ఉంది. ఈ నెల ఒకటో తేదీలోపే అన్ని పాఠశాలలకు రాగిపిండి అందాల్సి ఉన్నా సరఫరాలో జాప్యం కారణంగా విద్యార్థులకు జావ పంపిణీ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకుండానే కేవలం ప్రచారం కోసమే కార్యక్రమాన్ని ప్రారంభించిందని పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాగి జావ అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
– కామిడి సతీష్‌ రెడ్డి, 9848445134