‘ర్యాగింగ్‌’.. ఓ రాక్షస క్రీడ!

'ర్యాగింగ్‌'.. ఓ రాక్షస క్రీడ!డిసెంబర్‌ 23 వ తేదీన వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ చాలా దారుణమైన విషయం. ఈ ఘటనలో 81 మంది విద్యార్థులు సస్పెన్షన్‌ అయ్యారు. ఆదిమ మానవుడు నుండి నాగరిక సమాజంలోకి మనిషి అడుగు పెట్టినా బుర్రలో ఎక్కడో దాగి ఉన్న పైశాచిక బుద్ధి అను కూల పరిస్థితులలో బయటకు వచ్చి బుసలు కొడు తోంది. ఎదుటివారి నిస్సహాయక పరిస్థితే ఇవతలి వాడికి అనుకూల పరిస్థితి. విద్యార్థుల స్థాయిలో ఇది ర్యాగింగ్‌ రూపంలో బయటపడుతోంది. ర్యాగింగ్‌ ఓ పైశాచిక క్రీడ. సైకోయిజం. సూక్ష్మంగా చెప్పాలంటే ర్యాగింగ్‌ అనేది ఎదుటివాడిని ఇబ్బంది పెట్టి దానిని చూసి ఆనందపడే ఒక పాశవిక చర్య. కళాశాలల్లో సీనియర్‌ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యా ర్థులకు మనస్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించడం. మన దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థలో ర్యాగింగ్‌ అనేది కలవర పెట్టే వాస్తవం. దీని వలన అమాయకుల ప్రాణాలు బలవుతు న్నాయి. వేలాది మంది తెలివైన విద్యార్థుల భవిష్యత్‌ నాశనం అవుతున్నాయి. లోతుగా చూస్తే ఇది జూనియర్ల పై వివక్షత చూపడమే. ఈ వివక్షత అనేది రంగు, జాతి, మతం, కులం, లింగం, ప్రాంతీయత, పుట్టిన ప్రదేశం, నివాస స్థలం, ఆర్థిక నేపథ్యం వంటి అనేక రూపాలలో ఉంటుంది. జూనియర్‌ శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అధిక స్థాయిలో ఉంటే ర్యాగింగ్‌ చేయడానికి భయపడతారు. ఏతావాతా తెలివితేటలు ఉన్నా కూడా బలహీనులే బలవుతు న్నారు. ఒక్కోసారి ఈ వేదనను భరించలేక తగు సమయం లో పరిష్కరించే వారు లేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటు న్నారు. ఈ ర్యాగింగ్‌లో లైంగిక వేధింపులు, స్వలింగ సంప ర్కదాడులు, బట్టలు విప్పడం, బలవంతంగా అశ్లీల చర్యలు, సంజ్ఞలు, శారీరక హాని లేదా ఆరోగ్యానికి లేదా వ్యక్తికి ఏదైనా ఇతర ప్రమాదం కలిగించే చర్యలు ఉంటాయి. సీనియర్లు వారి నోట్సులు రాయించుట, అకాడమిక్‌ టాస్కులను జూని యర్లతో చేయిస్తున్నారు. ఈ ర్యాగింగ్‌కు ఓ రిషితీశ్వరి, ప్రీతి లాంటి వారు ఎంతో మంది బలయ్యారు.
కమిటీలు ఏం చెప్పాయి?: ఏకే గంగూలీ నేతృత్వం లోని ధర్మాసనం ”అందరూ ఒకే విధమైన మనస్తత్వంతో ఉండరు. కొందరు అత్యంత సున్నిత మనస్కులై చిన్న పాటి విషయాలకే ఉద్రేకానికి గురవుతుంటారు” అని పేర్కొంది. 1999లో విశ్వ జాగృతి విషయంలో సుప్రీం కోర్టు ర్యాగింగ్‌ను ”మాట్లాడిన లేదా రాసిన మాటల ద్వారా లేదా ఇతర విద్యార్థిని ఆటపట్టించడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం, రౌడీ లేదా క్రమశిక్షణా రాహిత్యం వంటి ప్రభావంతో కూడిన ఏదైనా క్రమరహిత ప్రవర్తన. ఒక ఫ్రెషర్‌ లేదా జూనియర్‌ విద్యార్థిలో చికాకు, కష్టాలు లేదా మానసిక హాని కలిగించే లేదా భయం లేదా భయాన్ని పెంచే కార్యకలాపాలు లేదా విద్యార్థి సాధారణ కోర్సులో చేయని ఏదైనా చర్య లేదా ఏదైనా చేయమని విద్యార్థులను అడగడం, ఒక ఫ్రెషర్‌ లేదా జూనియర్‌ విద్యార్థి శరీరాకృతి లేదా మానసిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేసే విధంగా అవమానం లేదా ఇబ్బందిని కలిగించే లేదా సృష్టించే ప్రభా వాన్ని కలిగించడమని నిర్వచించింది. డెభ్భైవ దశకం చివరిలో ఒక ప్రాంతీయ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇద్దరు ఫ్రెషర్లు మరణించిన తరువాత భారత ప్రభుత్వం దేశంలో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ మొదటిసారి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు విశ్వవిద్యాలయాలకు మార్గదర్శ కాలను జారీ చేయాలని విశ్వ జాగృతి మిషన్‌ దాఖలు చేసిన పిల్‌పై గౌరవనీయులైన సుప్రీంకోర్టు 1999లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ని కోరడంతో న్యూఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కేపీఎస్‌ ఉన్ని ఆధ్వర్యంలో ర్యాగింగ్‌పై పరిశీలించి నివేదిక సమర్పించేం దుకు యూజీసీ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఉన్నీ కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్‌పై చట్టాలు తీసుకురావాలని సూచిం చింది. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా సున్నితత్వం కోసం చేపట్టా ల్సిన పలు చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. విద్యార్థులను ర్యాగింగ్‌ వ్యతిరేక కార్యకలా పాలకు ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ర్యాగింగ్‌ను అరికట్టడంలో విఫలమైన సంస్థలను అడ్మిషన్లకు దూరంగా ఉంచాలని కూడా సూచించింది. విద్యార్థుల అడ్మిషన్‌ రద్దు నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే వరకు శిక్షలు విధించాలని ఈ కమిటీ సూచించింది. తీవ్రతను బట్టి మూడేండ్ల వరకు కఠిన కారా గారశిక్ష విధించవచ్చని తెలిపింది. 2006లో గౌరవ సుప్రీం కోర్టు ర్యాగింగ్‌ను నిరోధించడానికి మార్గాలు, పద్ధతులను సూచించడానికి సి.బి.ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ కె రాఘవన్‌ ఆధ్వ ర్యంలో మరొక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పలు కీలక పరిశీలనలు చేసింది. ర్యాగింగ్‌కు మానసిక, సామాజిక, రాజ కీయ, ఆర్థిక, సాంస్కృతిక సహా అనేక అంశాలు కారణాలుగా ఉన్నాయని, ఇది ఉన్నత విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. పాఠశాల దశ నుంచే మానవీయ విలువలను పెంపొందించడంలో మన వైఫల్యం ర్యాగింగ్‌గా పరిగణించబడుతుంది అని చెప్పింది. ర్యాగింగ్‌ జరిగినట్లయితే యాజమాన్యం, ప్రిన్సిపల్‌ బాధ్యత వహిం చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ర్యాగింగ్‌ను అరి కట్టేందుకు కమిటీ ‘ఐ’ కొన్ని బలమైన సిఫార్సులు చేసింది. క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ కేసుల పెరుగుదల సమస్యను పరిష్కరించడానికి, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యు.జి. సి) ఉన్నత విద్యాసంస్థలలో ర్యాగింగ్‌ ముప్పును అరికట్టడంపై నిబంధనలు 2009 పేరున తీసుకువచ్చింది. దీని ప్రకారం ర్యాగింగ్‌కి పాల్పడిన వారికి సస్పెన్షన్లు విధించవచ్చని, స్కా లర్‌షిప్‌, ఫెలోషిప్‌లు నిలిపి వేయొచ్చు. పరీక్షలకు హాజరు కాకుండా డీబార్‌, పరీక్షల ఫలితాలు నిలుపుదల, హాస్టల్‌ నుండి బహిష్కరణ, అడ్మిషన్లు రద్దు వంటివి చేయొచ్చు.
ఇంకా ఏదైనా ఇతర సంస్థలో ప్రవేశం నుండి డిబార్‌ చేయొచ్చని తెలిపింది. వీటిని ఉన్నత విద్యా సంస్థలు తప్పని సరిగా పాటించాలని తెలిపింది. 1997లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం ర్యాగింగ్‌ నిషేధ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ర్యాగింగ్‌ అనే ది కళాశాలలే కాకుండా విద్యను బోధించే ఏ సంస్థ అయనా, అనాధశరణాలయం, విద్యార్థి వసతి గృహం, ట్యుటోరియల్‌ కాలేజీ వంటి విభాగాలన్నీ ఇదే కోవలోకి వస్తాయని, ఇవీ కాక ఈ సంస్థల వెలుపల కూడా అనగా రోడ్లు, బస్సులు ఆగే ప్రాంతం, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వైద్యశాల వంటి ప్రదేశాలన్నింటిలోనూ ర్యాగింగ్‌ చేయటం నేరం. ఒక వి ద్యార్థికి ర్యాగింగ్‌ ద్వారా అవమానం చేసి అతన్ని బాధించడం జరి గితే 6 నెలల వరకు జైలు శిక్ష వెయ్యి రూపాయల వరకు జరిమానా విధింపబడుతుంది. ర్యాగింగ్‌ సందర్భంలో మర ణించటం జరిగిన లేదా ఆ విద్యార్థి ఆత్మహత్యకు లోనైనా నేరస్తునికి జీవిత ఖైదు లేదా పదేండ్ల వరకు జైలుశిక్ష , 50వేల రూపాయల వరకు జరిమానా విధింపబడతాయి. యు.జి.సి ర్యాగింగ్‌ బాధితులకు సహాయం చేయడానికి 12 భాష లలో 1800-180-5522 యాంటీ ర్యాగింగ్‌ టోల్‌-ఫ్రీ ”హెల్ప్‌ లైన్‌”ని ఏర్పాటు చేసింది. ఇంకా యాంటీ ర్యాగింగ్‌ వెబ్‌ సైట్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో ఫిర్యాదులు చేయొచ్చు. పరిష్కారస్థితిని రియల్‌ టైంలో తెలుసు కోవచ్చు.
పరిష్కారాలు : ర్యాగింగ్‌ నిరోధానికి కళాశాలలు, ప్రత్యేక బాధ్యత వహించాలి. కళాశాలలో చేరే సమయంలో అండర్‌ టేకింగ్‌ తీసుకోవాలి. సీనియర్‌లు, జూనియర్‌లు కల వకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వారికి విడివిడిగా హాస్టల్‌ వసతి కల్పించాలి. ర్యాగింగ్‌ ఎంత పెద్ద నేరమో అవగాహన కలిగించాలి. విద్యాలయాలలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్‌ కేంద్రాలు, యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఏవిధమైన ఒత్తిడికి గురికాకుండా చురుగ్గా పనిచేసి సత్వర నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఉంచాలి. కొన్ని సినిమాలు, వెబ్‌ సీరియల్స్‌ను నిషేధించాలి. యువత విచ్చలవిడితనాన్ని విడిచిపెట్టాలి. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలకు ర్యాగింగ్‌ ఎంత నేరమో తెలియజేయాలి. దోషులకు కఠిన శిక్షలు వేయాలి. వీరి పేర్లు, వారికి పడ్డ శిక్షలు ప్రతీ కాలేజీ నోటీసు బోర్డులో ఉండేటట్లు చూడాలి. ర్యాగింగ్‌ గురించి ఉన్నత పాఠశాల స్థాయిలో పాఠాలుగా చేర్చాలి. ర్యాగింగ్‌ను అరికట్టాల్సిన ప్రాథమిక బాధ్యత విద్యా సంస్థలపైనే ఉంటుంది. వాటిని నియంత్రించడంలో మీడియా, పౌర సమాజం చురుకుగా పాల్గొనవలసిన అవసరం ఉంది.
డి.జె. మోహనరావు
8247045230