కబ్జా కోరల్లో రాగులకుంట

– పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
నవతెలంగాణ – భీంగల్
చెరువుల పరిరక్షణపై అధికారుల నిఘా  కొరబడిందని చెప్పచ్చు. చెరువుల పరిరక్షణకు పాటుపడుతున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు ఆ దిశగా అధికారులను  అప్రమత్తం చేయలేక పోతుంది. అధికారుల పర్యవేక్షణ  కరువు అవడంతో  అందిన కాడికి కబ్జాకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం అనువయినంత కబ్జాకు పాల్పడుతూ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.  కుంట కబ్జా గురైతున్నట్లు ఆయకట్టు రైతులు పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన  ఏ ఒక్క అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.
భీంగల్ పట్టణ  కేంద్రం నుండి బెజ్జోరకు వెళ్లే రోడ్డులో గల రాగులకుంట శిఖం  రెవెన్యూ రికార్డులలో 1256  సర్వే  నెంబర్ లో సుమారు 19 ఎకరాలు ఉంది. ప్రస్తుతం ఈ చెరువు 10  ఎకరాలు కూడా లేదు.  ఈ చెరువు ద్వారా సుమారు 20 ఎకరాలకు పైన చిన్న సహకార రైతులు ఆధారపడి  వర్ష కాలము పంట  పండించే జీవనం సాగిస్తున్నారు. కానీ  ఈ కుంట పై కొందరు కబ్జారాయుళ్ల కన్ను పడి వారికి వీలైన కాడికి ప్రతి సంవత్సరం కొంత భూమిని కబ్జా చేస్తూ  తమ భూమిలో కలుపుకుంటున్నారు.
ఈ చెరువును పట్టించుకునే నాథుడే లేడు..
 గతంలో వర్షాలతో నిండిన చెరువును రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కాందార్లు ఆయకట్టు రైతుల పంట పొలాలకు నీటిని విడుదల చేసేవారు కానీ కాలక్రమేనా గడిచిన కొన్ని రోజుల నుండి రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ  కరువైంది. దీంతో వర్షాకాలం పూర్తి నీటితో నిండిన ఈ  చెరువును కొందరు దురుద్దేశంతో రాత్రికి రాత్రే తూమును లేపేయడంతో నీరంతా  పంట పొలాల నుండి ప్రవహించడంతో పంట పొలాలు నాశనం అవుతున్నాయి. దీంతో చెరువు   నీరంతా ఖాళీ అవుతుంది.  పంట చివరి దశలో అవసరమయ్యే నీరు కూడా అందడం లేదు . ఈ విషయమై గతంలో  ఆయకట్టు రైతులు ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఏ ఒక్కరు  పట్టించుకోలేదు.