రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్‌ గాంధీ విఫలం- కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్‌ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కి కట్టుబడి ఉన్నామని చెప్తూనే ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారన్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన న్యాయపత్ర (మ్యానిఫెస్టోకి) విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే, ఫిరాయింపులను అరికడతామంటూ చెబుతున్న మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. పార్టీల ఫిరాయింపులను నిరోధిస్తాం అంటూ పొందుపర్చిన మ్యానిఫెస్టో అంశంపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆ అరడజను మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంగతేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ బీఫాంపై పోటీ చేసిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. వీటన్నింటిపై మౌనంగా ఉంటున్న రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.