స్వర్ణదేవాలయంలో రాహుల్‌

Rahul in Swarnadevalayam– వాలంటీర్‌లతో కలిసి పాత్రలు శుభ్రంచేసిన నేత
అమృతసర్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ప్రార్థనల అనంతరం ‘కరసేవ’లో పాల్గొన్నారు. పార్టీ సభ్యులు, గురుద్వారా వాలంటీర్లతో కలిసి పాత్రలు శుభ్రం చేశారు. ‘ఇది రాహుల్‌ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పర్యటన. ఆయన గోప్యతను గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు మరోసారి ఆయన్ని కలిసి మద్దతు తెలియజేయవచ్చు’ అని పార్టీ కార్యకర్తలను కోరుతూ పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా అరెస్ట్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌, అధికార ఆప్‌ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో రాహుల్‌ అమృత్‌సర్‌ వచ్చారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ను పంజాబ్‌ పోలీసులు గత వారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఆప్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ రక్తదాహంతో ఉన్నారని ఆరోపించింది. సుఖ్‌బీర్‌ను భౌతికంగా అంతమొందించినా తాను ఆశ్చర్యపడబోనని అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. అయితే 2015 నాటి కేసులో తాజాగా ఆధారాలు లభించినందునే సుఖ్‌పాల్‌ను అరెస్ట్‌ చేయడం జరిగిందని ఆప్‌ ప్రభుత్వం చెబుతోంది.