సభకు రాహుల్‌…

‘మోడీ’ ఇంటి పేరు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను గత శుక్రవారం సుప్రీం కోర్టు నిలుపుదల చేయడం ద్వారా… కింది కోర్టులు చేసిన తప్పిదాలను సరి చేసింది. ‘సుప్రీం’ మంజూరు చేసిన స్టే రాహుల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఊరట. కేంద్రంలో ఉన్న ప్రజా కంటక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యం ప్రాతిపదికగా పని చేస్తున్న విపక్ష ‘ఇండియా’ సంగమం వైపు నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన కీలక నాయకులపై ఉద్దేశపూర్వక ఎజెండాతో ఒక పథకం ప్రకారం అక్రమ కేసులు బనాయిస్తున్న బీజేపీకి సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు మింగుడు పడని వ్యవహారం. ఈ కేసులో తప్పిం చుకున్నా రాహుల్‌పై మరెన్నో కేసులు న్నాయని కేంద్ర బీజేపీ మంత్రులు, నేతలు ఆడిపోసుకుంటున్నారు. పరు వునష్టం కేసులో ఈ ఏడాది 23న సూరత్‌ ట్రయల్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కొన్ని గంటల్లోనే ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలను ఉటంకిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటి ఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన మూడు రోజుల తర్వాత తీరిగ్గా, అదీ కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాల డిమాండ్‌ తర్వాత సోమవారం రాహుల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫై చేయడం గమనార్హం.
2019 సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో మోడీ అనే ఇంటి పేరు ఉన్నవాళ్లందరూ దొంగ లంటూ బీజేపీ జమానాలో బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి దేశాన్ని విడిచి పారిపోయిన కరడు గట్టిన ఆర్థిక నేరస్తులు లలిత్‌ మోడీ, నీరవ్‌ మోడీ, తదితరుల పేర్లను రాహుల్‌ ప్రస్తావించారు. వాస్తవానికి రాహుల్‌ చేసింది కేవలం రాజకీయ ఆరోపణ. ఒక నిర్దిష్ట కులానికి, ఇంటి పేరు కలిగిన వారికి అస్సలు వర్తిం చదు. ఎక్కడో కర్నాటక కోలార్‌ లో రాహుల్‌ విమర్శ చేస్తే గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ కేసు వేయడం ఒక వింత అయితే, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లల్లో ఉన్న ఒబిసి కులస్తులందరి పరువుకూ రాహుల్‌ వ్యాఖ్యలు నష్టం కలిగించాయని క్రిమినల్‌ కేసు వేయడం వింతల్లో వింత. కాగా రాజకీయ విమర్శకు సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు విధించింది. ఇటువంటి కేసుల్లో రెండేళ్ల జైలు పడటం ఇదే తొలిసారి. సూరత్‌ మెజి స్ట్రేట్‌ నియా మకం, హడావుడిగా సెలవుల్లే కుండా కేసు విచారణ, రెండేళ్ల జైలుశిక్ష విధింపు అసా ధారణం. ఈ ప్రహసనాన్ని బట్టే రాజకీయ ప్రేరేపితం అని స్పష్టమైపోతుంది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా కేసులో దోషిగా నిర్ధారణై రెండేళ్లు, అంత కంటే ఎక్కువ శిక్ష పడితే అటు వంటి వ్యక్తి రాజ్యాంగ పదవులకు అనర్హుడవుతాడు. శిక్షాకాలంతో పాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోతారు. ఐపిసి సెక్షన్‌ 499 కేసులో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో ఆ రెండూ విధించే అవకాశం ఉంది. రాహుల్‌ను దోషిగా పేర్కొన్న సూరత్‌ కోర్టు గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష విధించడానికి కారణాలను పేర్కొన లేదని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. గతంలో ‘దేశ్‌కా చౌకీదార్‌ చోర్‌ హై’ అన్న వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రాహుల్‌ను మందలించిం దన్న అంశాన్ని మాత్రమే ప్రస్తావించిందని పేర్కొంది. అప్పిలేట్‌ కోర్టు, హైకోర్టు సైతం రాహుల్‌ స్టే అభ్యర్ధనను తోసిపుచ్చడంపై కేంద్రీ కరించాయి తప్ప గరిష్ట కాల శిక్ష విధింపునకు కారణాలు తెలపలేదు. సదరు గరిష్ట కాలశిక్షే లోక్‌సభలో రాహుల్‌పై అన ర్హత వేటు వేయడానికి సాధనం అయిందని కింది కోర్టుల విచా రణ, పరిశీలనపై సుప్రీం తీవ్రంగా వ్యాఖ్యా నించడం గమనార్హం.
ఇటువంటి శిక్షలు విధించినప్పుడు ఆయా వ్యక్తులు ప్రాతి నిధ్యం వహించే నియోజకవర్గాల ప్రజల గురించి కూడా ఆలోచిం చాలని పేర్కొనడం అభినందనీయం. ప్రతిపక్షాలపై ఇ.డి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి కక్ష సాధిóస్తున్న మోడీ ప్రభుత్వం సరికొత్తగా పరువు నష్టం (క్రిమినల్‌) కేసులను బనాయించే సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. అందులో భాగమే రాహుల్‌పై కేసు. కేంద్ర ప్రభుత్వ ఈ తరహా వేధింపులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.