– బజరంగ్ పూనియాతో సహా పలువురితో సంభాషణ
– హర్యానాలో కాంగ్రెస్ అగ్రనేత పర్యటన
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఉదయం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని వీరేంద్ర ఆర్య అఖారాలో పర్యటించారు. అక్కడ బజరంగ్ పునియాతో సహా మల్లయోధులతో సంభాషించారు. రెజ్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ)పై తాజా వివాదం మధ్య ఆయన పర్యటించటం గమనార్హం.. డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడు సంజరు సింగ్ ఈ ఏడాది చివరి నాటికి అండర్-15, అండర్-20 నేషనల్స్‌కు ఆతిథ్యం ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాత క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్‌ఐని సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్లు సంజరు సింగ్ బ్రిజ్ భూషణ్‌కు చాలా సన్నిహితుడు కాబట్టి సంజరు సింగ్ ఎన్నికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. బజరంగ్ పునియా అతని పద్మశ్రీని వాపసు చేశారు. వినేష్ ఫోగట్ సైతం ఆమె ఖేల్ రత్న, అర్జున అవార్డును తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించారు. రాహుల్ గాంధీ తనతో వ్యాయామం చేశారనీ, కుస్తీ పట్టేందుకు ప్రయత్నించారని బజరంగ్ పునియా చెప్పారు. రాహుల్ గాంధీ తమతో యూట్యూబ్ ఛానెల్ కోసం అకారా వద్ద వీడియోను చిత్రీకరించారనీ, మల్లయోధుడి రోజువారీ జీవితం ఎలా ఉంటుందో చూడటానికి ఆయన వచ్చాడని తెలిపారు. రాహుల్ గాంధీ ఉదయం 6.15 గంటలకు అఖారాకు చేరుకున్నారని కోచ్ వీరేంద్ర ఆర్య చెప్పారు. రాహుల్ గాంధీ పర్యటన గురించి తమకు తెలియదన్నారు.