రసాయనపురం అనే గ్రామంలో రాహుల్ అనే విద్యార్థి ఉండేవాడు. అతడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. క్లాసులో ఎప్పుడూ అల్లరి చేసేవాడు. పిల్లలంతా ‘అల్లరి రాహుల్.. అల్లరి రాహుల్’ అని పిలిచేవారు. పేరుకు తగ్గట్టే అన్నీ అల్లరి పనులే చేసేవాడు రాహుల్.
ఒకరోజు ప్రధానోపాధ్యాయులు ప్రార్థన సమయంలో మాట్లాడుతూ ”మనకు వచ్చే నెలలో సైన్స్ మేళా ఉంది. బహుమతులు కూడా ఉంటాయి. సైన్స్ అంటే ఆసక్తి ఉన్నవాళ్లు సైన్స్ ఉపాధ్యాయుడికి పేర్లు ఇవ్వండి” అని చెప్పాడు.
రాహుల్ ప్రార్థన ముగిసిన వెంటనే పరిగెత్తుకుంటూ సైన్స్ ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళాడు. ”సార్ …నేను కూడా సైన్స్ మేళాలో పాల్గొంటాను. సార్ నాకు ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం సార్” అని ఉపాధ్యాయుడిని అడిగాడు రాహుల్. అక్కడే ఉన్న పిల్లలంతా ”సార్.. వీడు సైన్స్ మేళాలో పాల్గొంటే కార్యక్రమం అంతా సర్వనాశనం అవుతుంది. అంతా అల్లరి చేస్తాడు. వద్దు సార్” అని చెప్పారు. విద్యార్థుల మాట విన్న ఉపాద్యాయుడు ”రాహుల్.. ఈసారికి నువ్వు వద్దులే. మరి ఇంకెప్పుడైనా చూద్దామని” అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పట్టు విడవని రాహుల్ ఉపాధ్యాయుని వెనకాల వెళ్లాడు. సాయంత్రం వరకు బతిమిలాడుతూనే ఉన్నాడు. తన ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయుడు ‘సరే’ అని రాహుల్ పేరును నమోదు చేసుకున్నాడు.
సైన్స్ మేళా కోసం ప్రయోగశాలలో ప్రయోగాలు చేయించాడు ఉపాధ్యాయుడు. రిషి ఏవేవో రసాయనాలను కలిపాడు. ఒక్కసారిగా ల్యాబ్ మొత్తం పొగలు వ్యాపించాయి. ఎవరికీ ఊపిరి ఆడక పోవడంతో విద్యార్థులంతా కేకలు వేశారు. అక్కడే ఉన్న రాహుల్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. డోర్లు, కిటికీలన్నీ ఓపెన్ చేశాడు. విద్యార్థులందరినీ బయటికి తీసుకుని వచ్చాడు. అందరూ ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ రిషి అక్కడే కిందపడిపోయి ఉన్నాడు. వెంటనే తన జేబులో ఉన్న కర్చీఫ్ నీ ముక్కుకు కట్టుకొని రిషిని బయటికి తీసుకుని వచ్చాడు.
మళ్లీ లోపలికి వెళ్ళిన రాహుల్ రసాయనం ఉన్న బీకరులో ఏదో ఆమ్లాన్ని కలిపాడు. దానితో పొగలన్నీ తగ్గిపోయాయి. ఉపాధ్యాయులంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాహుల్ ధైర్యానికి మెచ్చుకున్నారు. ”రాహుల్ ఇది ఏ ఆమ్లం. ఎలా కలిపావు? నీకు ఎలా తెలుసు? అని ఉపాధ్యాయుడు అడిగాడు.
”సార్.. నేను ప్రతిరోజూ ఇంటికి వెళ్ళగానే పాఠ్య పుస్తకాన్ని, అందులో ఉన్న అంశాలను జాగ్రత్తగా చదువుతాను. నాకు పొగలు తాగ్గాలంటే ఏ ఆమ్లం కలపాలో తెలుసు. అందుకే ఆ ఆమ్లాన్ని కలిపి పొగలను తగ్గించాను” అని చెప్పాడు రాహుల్. అప్పటినుండి రాహుల్ మీదున్న అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది. విద్యార్థులందరూ అతన్ని ఒక సైన్స్ విద్యార్థిగా చూసేవారు. అలా చూడడం నచ్చడంతో రాహుల్ తను చేసేటువంటి అల్లరిని కూడా తగ్గించసాగాడు. సైన్స్ మేళా రోజు రానే వచ్చింది. అక్కడికి వివిధ పాఠశాల నుండి ఎంతోమంది విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడకి వచ్చినటువంటి న్యాయ నిర్ణేతలకు రాహుల్ చేసిన ప్రాజెక్టు బాగా నచ్చింది. రాహుల్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. తనకే కాదు పాఠశాలకు మంచి పేరును తెచ్చిపెట్టిన రాహుల్‌ను ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ మెచ్చుకున్నారు.
– తాళ్లూరి రేఖశ్రీ, 10వ తరగతి,
పి.హెచ్.ఎస్, కోదాడ, సూర్యాపేట