రారుబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌

రారుబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌– హాజరైన ఖర్గే, సోనియా, ప్రియాంక
– అమేథి నుంచి కిషోరీ లాల్‌ శర్మ నామినేషన్‌ దాఖలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉత్తరప్రదేశ్‌లోని రారుబరేలి నుంచి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథి నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్‌ శర్మను రంగంలోకి దించింది. అమేథి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కిషోరీ లాల్‌ శర్మ నామినేషన్‌ వేశారు. శుక్రవారం అమేథి రిటర్నింగ్‌ అధికారికి ఆయన తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రాన్ని వదిలేసి వారణాసికి ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ‘రాహుల్‌ గాంధీ గురించి ప్రశ్నించే ముందు ఆయన (ప్రధాని మోడీ) తనకు తానుగా వారణాసికి ఎందుకు పారిపోయాడో అడగండి’ అని మీడియా ప్రతినిధులకు ఖర్గే సూచించారు. యూపీలోని రారుబరేలి, అమేథి నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన అనంతరం పార్టీ నిర్ణయాన్ని ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ సమర్థించారు. రారుబరేలి నుంచి రాహుల్‌ గాంధీని బరిలోకి దింపడం బీజేపీ ఆ పార్టీ మద్దతుదారులకు షాక్‌కు గురిచేసిందని వ్యాఖ్యానించారు.రారుబరేలి నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తారనే వార్తలపై ఎంతో మందికి ఎన్నో అభిప్రాయాలున్నాయని, రాజకీయాల్లో, చెస్‌లో ఆయన ఎంతో అనుభవమున్న ఆటగాడనే విషయాన్ని మరవరాదని జైరాం రమేష్‌ అన్నారు. విస్తత చర్చ అనంతరం భారీ వ్యూహం, ఎత్తుగడల్లో భాగంగా పార్టీ నాయకత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఈ నిర్ణయం బీజేపీ సహా దాని మద్దతుదారులను వణికిస్తోందని జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షాను ఉద్దేశిస్తూ అపర చాణుక్యుడిగా చెప్పుకునే బీజేపీ నేతకు ఇప్పుడెలా స్పందించాలో తెలియడం లేదన్నారు. రారుబరేలి చాలాకాలంగా ఇందిరా గాంధీ, సోనియా గాంధీల స్ధానం మాత్రమే కాదని, ఇది వారసత్వం కాదని, ఇది బాధ్యత అని జైరాం రమేష్‌ వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబానికి అమేథి-రారుబరేలి మాత్రమే కాదని, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ దేశమంతా కాంగ్రెస్‌కు పట్టుందని పేర్కొన్నారు.