రాహుల్‌ వింత కల

రాహుల్‌ వింత కలరాహుల్‌ అనే ఒక పిల్లవాడు 5వ తరగతి చదువుకుంటున్నాడు. చాలా తెలివైన వాడైనా, పరీక్షల సమయం వస్తే చాలా టెన్షన్‌ పడేవాడు. పరీక్షలు వస్తాయనే భయంతో సరిగా చదవకపోవడం వల్ల మరింత ఒత్తిడికి లోనయ్యేవాడు.
ఒక రోజు రాహుల్‌ అలా చదువుతూ పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో అతను ఒక అడవిలో ఒంటరిగా నడుస్తున్నాడు. అడవి చుట్టూ పెద్ద పెద్ద పాములు, చిరుతలు, భయంకరమైన శబ్దాలు. రాహుల్‌ ఎంతగానో భయపడ్డాడు. అలా నడుస్తూ వెళ్తుంటే అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. ఆ వృద్ధుడు రాహుల్‌కు హాయిగా కనిపించాడు.
రాహుల్‌ అతనిని చూసి ఆశ్చర్యపోయి, ”అన్నీ ఇంత భయంకరంగా ఉన్నాయి, మీరు ఎలా హాయిగా కూర్చున్నారు?” అని అడిగాడు.
వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, ”ఈ భయం నీ మనసులోనే ఉంది రాహుల్‌. నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే, ఎలాంటి సమస్య అయినా చిన్నది అవుతుంది. మెల్లగా ఊపిరి పీల్చు, నీ పని మీద దృష్టి పెట్టు. అప్పుడు నువ్వు విజయవంతమవుతావు” అని చెప్పాడు.
రాహుల్‌ వృద్ధుడి మాటలు విని ఊపిరి పీల్చి, మనసు ప్రశాంతంగా ఉంచాడు. ఆ వింత కలలో ఉన్న చిరుతలు, పాములు ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. అడవి నిశ్శబ్దంగా మారింది.
రాహుల్‌కు కల నుండి మెలకువ వచ్చింది. తనకి ఒత్తిడి కలిగించిన భయం కేవలం తన ఆలోచనలే అని అతనికి అర్థమైంది. అప్పటినుండి ప్రతిసారీ పరీక్షలకు సిద్ధం కాబోతున్నప్పుడు, తన మదిని ప్రశాంతంగా ఉంచి, క్రమంగా చదవడం మొదలుపెట్టాడు. అతని ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయింది.
మోరల్‌: ఒత్తిడి, భయం మనసులోనే మొదలవుతాయి. మనం వాటిని సరిగా గుర్తించి, మనసును ప్రశాంతంగా ఉంచితే, ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించగలం.
పిల్లలలో ఒత్తిడి
ప్రస్తుతం పిల్లలు చదువు, సాంకేతికత, సామాజిక జీవితంలో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. యుక్తవయస్సు వచ్చే సమయంలో మాత్రమే కాదు, చిన్న వయసులోనే పిల్లలు ఒత్తిడికి గురవడం సర్వసాధారణం. విద్యా సంబంధమైన ప్రెజర్‌, పరీక్షల భయం, స్నేహితులతో సమానంగా ఉండాలనే ప్రయత్నం, అంచనాలకు తగ్గట్టుగా ఎదగాలనే భావన వంటి అంశాలు పిల్లల మీద ఒత్తిడిని పెంచుతున్నాయి.
పిల్లలలో ఒత్తిడికి ప్రధాన కారణాలు
1. చదువుల ఒత్తిడి: పరీక్షలు, హోంవర్క్‌, గ్రేడ్‌లు పిల్లల మీద అత్యంత ఒత్తిడిని కలిగిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల అంచనాల వల్ల పిల్లలు మరింత ఒత్తిడికి లోనవుతారు.
2. సామాజిక ఒత్తిడి: స్నేహితుల సర్కిల్‌లో సమానంగా ఉండాలని ప్రయత్నించడం, మరికొందరి కంటే తక్కువగా భావించడం పిల్లల్లో ఓ ప్రత్యేకమైన ఒత్తిడిని కలిగిస్తుంది.
3. ప్రధాన మార్పులు: కుటుంబం మారడం, స్కూల్‌ మారడం, లేదా స్నేహితులను కోల్పోవడం వంటి జీవిత మార్పులు పిల్లలను మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి.
4. సాంకేతికత దుష్ప్రభావం:
సోషల్‌ మీడియా, వీడియో గేమ్స్‌ ద్వారా వచ్చే ఒత్తిడి, నిద్రలేమి, చదువు మీద దృష్టి తప్పడం పిల్లలను మానసికంగా ప్రభావితం చేస్తాయి.
పిల్లలలో ఒత్తిడిని గుర్తించడం:
– అసహనం, చిరాకు వ్యక్తం చేయడం.
– నిద్రలేమి లేదా ఎక్కువ నిద్ర పోవడం.
– సామాన్యంగా చేసే పనుల్లో ఆసక్తి లేకపోవడం.
– ప్రతిదానికీ భయపడటం.
– ఆకలి తగ్గడం లేదా పెరగడం.
– ఎవరితో సరిగా మాట్లాడాక పోవడం
ఒత్తిడిని తగ్గించేందుకు పద్ధతులు:
– క్రమం తప్పకుండా విరామం ఇవ్వడం: పిల్లలకు చదువులో లేదా ఇతర కార్యక్రమాల్లో మధ్యలో విరామం అవసరం. వాకింగ్‌ లేదా ఆట ద్వారా వారిని ఉల్లాసంగా ఉంచాలి.
– పరిపూర్ణతకు ప్రయత్నం తగ్గించడం: పిల్లలు తప్పులను ఒప్పుకోవడం, అంగీకరించడం ముఖ్యం. తల్లిదండ్రులు వారి అంచనాలను సహజంగా ఉంచాలి.
– ఆరోగ్యకరమైన జీవనశైలి: సమయానికి భోజనం, నిద్ర, మానసికాభ్యాసం ద్వారా పిల్లలను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు.
– మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ:
పిల్లలతో మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవడం, వారి సమస్యలను గమనించడం ద్వారా ఒత్తిడిని గుర్తించి నివారించవచ్చు.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌