బీహార్‌లోకి రాహుల్‌ యాత్ర

బీహార్‌లోకి రాహుల్‌ యాత్ర– నేడు భారీ ర్యాలీ, మహాకూటమి నాయకుల హాజరు
కిషన్‌గంజ్‌ : కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యారు యాత్ర సోమవారం బీహార్‌లోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటలకు పశ్చిమబెంగాల్‌లోని సోనాపూర్‌ నుంచి ప్రారంభమైన యాత్ర ఉదయం 11 గంటలకు బీహార్‌ సరిహద్దులోని కిషన్‌గంజ్‌ చేరుకుంది. ఈ సందర్భంగా కిషన్‌గంజ్‌ జిల్లాల్లో జరిగిన ర్యాలీల్లో రాహుల్‌ మాట్లాడుతూ బీజేపీ, ప్రధాని మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే నితీష్‌కుమార్‌ ఇండియా వేదిక నుంచి బయటకు వెళ్లడంపై రాహుల్‌ స్పందించలేదు. మోడీ ప్రభుత్వానిది ‘విద్వేష భావజాలం’ అయితే, తమది ప్రేమ అనే భావజాలం అని అన్నారు. కొంత మంది ఎంపిక చేసిన బిలియనర్లకు దేశంలో ప్రజలందరీ డబ్బును మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్రంలో 90 మంది ఐఏఎస్‌ అధికారులు ఉంటే వారిలో ముగ్గురు మాత్రమే ఓబీసీలని అన్నారు. దేశ జనాభాలో 50 శాతం ఉన్న ఓబీసీలకు ఉద్యోగ, విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుల గణన అనేది దేశానికి ఎక్స్‌రే లాంటదని, అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన నిర్వహిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. ఈ దేశంలో పేదలు అన్యాయానికి గురవుతున్నారని, వారికోసమే ఈ యాత్ర అని రాహుల్‌ చెప్పారు. బీహార్‌లోని తూపమారి గ్రామం వద్ద యాత్రకు మధ్యహ్నా భోజన విరామాన్ని ప్రకటించారు. సాయంత్రం 4:30 గంటలకు మళ్లీ యాత్ర కొనసాగింది. కాగా, మంగళవారం బీహార్‌లో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీలో మహాకూటమికి చెందిన నాయకులు హాజరుకానున్నారు.