– ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి లబ్దిదారుల వినతి
నవతెలంగాణ – చైతన్యపురి
డబల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించి పట్టాలు ఇచ్చారని.. వెంటనే ఇండ్లను ఇవ్వాలని మహేశ్వర నియోజ కవర్గం డబల్ ఇండ్ల లబ్దిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు లబ్దిదారులు బుధవారం మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రాన్ని అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న తమకు ఆ ఇండ్ల కేటాయింపు జరిగిందని తెలిపారు. కానీ ఎన్నికల కారణంగా కొద్దిరోజులుగా తమకు పొజిషన్ చూపించడం లేదని, తాళాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తై నెల దాటినా తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక చొరవ తీసుకొని తమకు కేటాయించిన డబల్ బెడ్ రూం ఇండ్ల పొజిషన్ ఇప్పించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మంజుల, సక్కుబాయి, ఉమారాణి, సంధ్యా, హైమావతి, శోభారాణి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.