భారీ వర్షాలు…రైల్వే లైన్లు జాగ్రత్త

– ‘ఎంప్లారు ఆఫ్‌ ది మంత్‌’ అవార్డుల కార్యక్రమంలో ద.మ.రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారీ వర్షాలు కురుస్తున్నందున రైల్వే లైన్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. సికింద్రాబాద్‌ రైలు నిలయంలోని సోమవారం జరిగిన ‘ఎంప్లారు ఆఫ్‌ ది మంత్‌’ అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 8 మంది ఉద్యోగులకు అవార్డులు అందచేశారు. అవార్డులు ఉద్యోగుల్లో గుర్తింపును, విధుల్లో అంకితభావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. రైల్వే ట్రాక్‌లపై నిరంతర గస్తీ నిర్వహించాలనీ, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, నీటికుంటల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జోన్‌ మొత్తంగా నెలరోజులపాటు ప్రత్యేక సేఫ్టీ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. రైళ్ల సమయపాలనను కచ్చితంగా పాటించాలనీ, దానికోసం సాధ్యమైన మేరకు వేగ పరిమితులను ఎత్తివేయాలని చెప్పారు. రైల్వేస్టేషన్లలో వినియోగంలో లేని పాత నీటి ట్యాంకులను మార్చాలనీ, పాదచారుల వంతెల మరమ్మతులు వేగవంతం చేయాలని అన్నారు.