రైల్వే రహస్య బ్యాలెట్‌ ఎన్నికలు- రెండు సీఐటీయూ యూనియన్ల గుర్తింపు

Railway Secret Ballot Elections - Recognition of two CITU Unionsసీఐటీయూ అనుబంధ సంఘమైన దక్షిణ్‌ రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ (డిఆర్‌ఈయూ) దాఖలు చేసిన కేసును అనుసరించి రైల్వే ట్రేడ్‌ యూనియన్‌ల గుర్తింపు (భారతీయ రైల్వేలో సభ్యత్వం ధృవీకరణ) కోసం రహస్య బ్యాలెట్‌ ఎన్నికలను నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఎన్నికలు 2024 డిసెంబర్‌ 4,5,6 తేదీల్లో పదిహేడు జోన్లతో పాటు రెండు ఉత్పత్తి యూనిట్లు చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ అండ్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, కపుర్తలాలలో జరిగాయి.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2007 నుంచి భారతీయ రైల్వేలో రహస్య బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2013లో రెండోసారి ఎన్నికలు జరగ్గా, నిర్ణయించిన విధివిధానాల ప్రకారం మూడవ ఎన్నికలు 2019లో జరగాల్సి ఉంది. అయితే 2020 పారిశ్రామిక సంబంధాల కోడ్‌పై ఆధారపడి గుర్తింపు కోసం నిబంధనలు ఉండాలనే సాకుతో రైల్వే మంత్రిత్వ శాఖ ఎన్నికలను నిర్వహించకూడదని భావించింది. కానీ కార్మిక సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత రావటంతో రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను తయారు చేయలేదు. ఫలితంగా కేంద్రం తమ ఆలోచనను అమలు చేయలేక పోయింది. ఇప్పటికే ఉన్న నిబంధనల ఆధారంగా ఎన్నికలను నిర్వహించాలని డిఆర్‌ఈయూ అభ్యర్థించడానికి ఈ జాప్యం వెసులుబాటు కల్పించింది. వర్షాకాలం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, గూడ్స్‌ కార్యకలాపాలు ఉధృతంగా ఉండటం మొదలైన కారణాలను చూపుతూ ఎన్నికలను వాయిదా వేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఎంతో ప్రయత్నించినప్పటికీ, చివరికి ఎన్నికలను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
నిబంధనల ప్రకారం, నిర్దిష్ట పరిస్థితులలో రెండు యూనియన్లను గుర్తించవచ్చు. అవి ప్రధానంగా రైల్వే జోన్‌ లేదా ప్రొడక్షన్‌ యూనిట్‌లో మొత్తం ఓటర్లలో ముప్పై శాతం ఓట్లను రెండు యూనియన్‌లు పొందినట్లయితే, రెండూ గుర్తించబడతాయి. ఒక యూనియన్‌ మొత్తం ఓటర్లలో ముప్పై శాతం సాధించి, మరొక యూనియన్‌ పోలైన చెల్లుబాటయ్యే ఓట్లలో 35 శాతం సాధించినట్లయితే కూడా రెండు యూనియన్లు గుర్తించబడతాయి. మొత్తం ఓటర్లలో పదిహేను శాతం ఓట్లు పొందిన యూనియన్‌కు నోటీసు బోర్డులను పెట్టుకోవటానికి, గేట్‌ మీటింగ్‌లను నిర్వహించడానికి అర్హత లభిస్తుంది. ఈ నిబంధన చిన్న సంఘాలకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ప్రధానంగా ఆరెస్సెస్‌ మద్దతు గల భారతీయ రైల్‌ మజ్దూర్‌ సంఫ్‌ు (బీఆర్‌ఎంఎస్‌)కు అనుకూలంగా ప్రవేశపెట్టబడింది.భారతీయ రైల్వే ఎన్నికల్లో ప్రధాన పోటీదారులు ఎఐఆర్‌ఎఫ్‌తో పాటు ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ యూనియన్లు.ఎఐఆర్‌ఎఫ్‌ అనేది హెచ్‌ఎంఎస్‌కి అనుబంధంగా ఉండగా, ఎన్‌ఎఫ్‌ఐఆర్‌-ఐఎన్‌టీయూసీకి అనుబంధం. ఈ రెండు ఫెడరేషన్లు ఎన్నికలు లేకుండానే గుర్తింపు హోదాను కొనసాగించాయి. ఇది రైల్వే కార్మికులలో వాటి అపకీర్తికి దారితీశాయి. అవి ఏకీకృత పెన్షన్‌ స్కీమ్‌ అండ్‌ నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)కి మద్దతు ఇస్తున్నాయి. అలాగే ప్రయివేటీకరణ, ఔట్‌ సోర్సింగ్‌, ఖాళీలను భర్తీ చేయకపోవడం, పోస్టులను సృష్టించటంపైన నిషేధం, భద్రతా నిబంధనల ఉల్లంఘనలను సమర్ధవంతంగా ప్రతిఘటించ లేదని, పెట్టుబడి విస్తరణ, భద్రత కోసం మౌలిక సదుపాయాలు కల్పనా కోసం డిమాండ్‌ చేయటంలో విఫలమైనట్టు విమర్శలెదుర్కొన్నాయి.
మరో ఫెడరేషన్‌, భారతీయ రైల్‌ మజ్దూర్‌ సంఫ్‌ు (బీఆర్‌ ఎంఎస్‌), ఆరెస్సెస్‌ అనుయాయి అయిన బీఎంఎస్‌కి అను బంధంగా ఉంది. రైల్వేలో దీని ఉనికి చాలా తక్కువ. అయిన ప్పటికీ, బీఆర్‌ఎంఎస్‌కి మద్దతివ్వాలని రైల్వే మంత్రి అఖిల భారత ఎసీ,ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌తో అఖిల భారత ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ను ఆదేశించి నట్లు సమాచారం.అనేక రైల్వే జోన్లలో బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో, ఎఐఆర్‌ఎఫ్‌, ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ ఒక్కొక్కటి పదమూడు రైల్వే జోన్లలో గుర్తింపు పొంద గలిగాయి. నిబంధనల ప్రకారం ఈ రెండు ఫెడరేషన్లు గుర్తింపు పొందుతాయి, ఒక సమాఖ్య కనీసం ఆరు రైల్వేలలో గుర్తింపు పొందాలి. అలాగే భారతీయ రైల్వేలలో పోల్‌ చేయబడిన మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో పదిహేను శాతం గుర్తింపు పొందాలి.భారతీయ రైల్వేలతో పాటు ఉత్పత్తి యూనిట్లలో రెండు సీఐటీయూ అను బంధ సంఘాలున్నాయి. దక్షిణరైల్వేలో దక్షిణ రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ (డీఆర్‌ఈయు) అండ్‌ చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌లో చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ లేబర్‌ యూనియన్‌ (సీఎల్‌డబ్ల్యూఎల్‌యూ) ఈ ఎన్నికల్లో రెండు యూనియన్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.
దక్షిణ్‌ రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ (డిఆర్‌ఈయు) అనేది 1918లో స్థాపించబడిన ఒక చారిత్రాత్మక యూనియన్‌. 106 ఏండ్లు పూర్తిచేసుకుంది. స్వాతంత్య్ర పోరాటాన్ని కార్మికుల డిమాండ్లతో ముడిపెట్టి, రాజీలేని పోరాటాలను ప్రారంభించిన గొప్ప వారసత్వం ఈ యూనియన్‌కు ఉన్నది. స్వాతంత్య్రా నంతరం, రైల్వే కార్మికుల సమస్యలను నిరంతరం పరిష్కరి స్తూనే, డిఆర్‌ఈయు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో అగ్రగామిగా నిలిచింది. యూనియన్‌ నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పిఎస్‌) యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్‌), ప్రయివేటీకరణ, ఔట్‌ సోర్సింగ్‌ వంటి నయా ఉదారవాద విధానాలకు వ్యతిరే కంగా వివిధ పోరాటాలకు నాయకత్వం వహించింది. రైల్వే చట్టం కింద పెద్ద సంఖ్యలో రిక్రూట్‌ చేయబడిన క్యాజువల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయటంలోనూ, అలాగే అప్రెంటీస్‌ల ఉపాధి అవకాశాలను మెరుగుపరచటంలోనూ విజయ వంతమైన పాత్ర పోషించింది.
ఈ కృషి 2007 మొదటి రహస్య బ్యాలెట్‌ ఎన్నికలతో పాటు ఇప్పుడు మూడో ఎన్నికల్లోనూ డిఆర్‌ఈయు విజయం సాధించడంలో తోడ్పడింది. ఎఐఆర్‌ దాని అనుబంధ సంస్థ ఎస్‌ఆర్‌ఎంయు కార్మిక వ్యతిరేక వైఖరి కార్మికుల్లో బట్టబయలవటంతో డిఆర్‌ఈయు విజయానికి దోహదపడింది. ఈ ఎన్నికలలో, డిఆర్‌ఈయుకి ఆలిండియా స్టేషన్‌ మాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎఐఎస్‌ఎంఎ), ఆలిండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ (ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ), ఆర్‌ఎల్‌ఎల్‌ఎఫ్‌ (విసికె పార్టీతో అనుబంధం) సహా తొమ్మిది యూనియన్లు మద్దతిచ్చాయి. కేవలం పదిహేనువేల సభ్యత్వం మాత్రమే ఉన్న డిఆర్‌ఈయు ఈ ఎన్నికల్లో 26,151 ఓట్లను సాధించింది. ఇది మొత్తం 76,653 మంది ఓటర్లలో 34.11 శాతం. అయితే, దీనికి విరుద్ధంగా ఎఐఆర్‌ఎఫ్‌-అనుబంధ ఎస్‌ఆర్‌ఎంయు, ఓట్లను పొందేందుకు నగదు, బిర్యానీ, మద్యాన్ని పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ, డిఆర్‌ఈయు కంటే 107 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో 34.25 శాతం సాధించగలిగింది. ఇది 2013 ఎన్నికల్లో ఎస్‌ఆర్‌ఎంయు 43 శాతం ఓట్లతో ఏకైక యూనియన్‌గా అవతరించినప్పటికీ, తమ ఆధిపత్యం కోల్పోయినట్టు ఇది సూచిస్తుంది.
ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ (ఐఎన్‌టీయూసీ యూనియన్‌) అనుబంధ సంస్థ ఎస్‌ఆర్‌ఈఎస్‌- ఎఐఆర్‌ఎఫ్‌ యూనియన్‌కు తానే ప్రత్యర్థిగా ప్రచారం చేసుకునప్పటికీ, కేవలం పదహారు శాతం ఓట్లను మాత్రమే సాధించింది. వరుసగా మూడో ఎన్నికల్లో గుర్తింపు సాధించడంలో విఫలమైంది. ఎస్సీ,ఎస్టీ యూనియన్‌ మద్దతు తీసుకొని కూడా బీఆర్‌ఎంఎస్‌(ఆరెస్సెస్‌ మద్దతుగల) కార్మిక సంఫ్‌ు కేవలం నాలుగు శాతం ఓట్లను మాత్రమే సాధించింది.భారీ వర్షం ఉన్నప్పటికీ 2024 డిసెంబర్‌ 18న చెన్నరులోని జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద భారీ విజయోత్సవ ర్యాలీతో పాటు బహిరంగ సభ జరిగింది. సమావేశానికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జానకిరామన్‌ అధ్యక్షత వహించారు. సమావేశంలో మాజీ ఎంపీ టి.కె. రంగరాజన్‌, జి సుకుమారన్‌, అధ్యక్షుడు, సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఎ కె పద్మనాభన్‌, డిఆర్‌ఇయు ప్రధాన కార్యదర్శి వి హరిలాల్‌ ప్రసంగించారు. దక్షిణ రైల్వేలోని కార్మికులందరి సంక్షేమం కోసం కృషి చేస్తామని నేతలందరూ హామీ ఇచ్చారు. చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ (సిఎల్‌డబ్ల్యూ, సిఎల్‌డబ్ల్యూ లేబర్‌ యూనియన్‌ (సిఎల్‌డబ్ల్యూఎల్‌యు) 7,551కి 3,026 ఓట్లను (43.2శాతం) సాధించింది. ఎఐఆర్‌ఎఫ్‌- అనుబంధ యూనియన్‌ 138 ఓట్లను మాత్రమే సాధించింది అయితే ఎన్‌ఎఫ్‌ఐఆర్‌-అనుబంధ యూనియన్‌ 2,895 ఓట్లను (41శాతం) పొందింది. యూనియన్‌ కోర్టు విజయం తర్వాత గుర్తింపు కోసం ఎన్నికలను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇది సిఎల్‌డబ్ల్యూలో మొదటి రహస్య బ్యాలెట్‌ ఎన్నికగా గుర్తించబడింది.
సిఎల్‌డబ్ల్యూను ప్రభుత్వ రంగంలో నిలుపుకోవాలనే పోరాటంలో సీఐటీయూ అనుబంధ యూనియన్‌గా సిఎల్‌డబ్ల్యూఎల్‌యూ అగ్రగామిగా నిలిచింది. ఇది కార్మికుల హక్కులను నిరంతరం సమర్థించింది. ఎఐఆర్‌ఎఫ్‌ అండ్‌ ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ ప్రభుత్వ అనుకూల విధానాలను బహిర్గతం చేసింది. కేంద్ర ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను గట్టిగా వ్యతిరేకించింది. అందుకే కార్మికులు సిఎల్‌డబ్ల్యూ ఎల్‌యూకు ఫెడరేషన్‌ లేకపోయినా అత్యధికంగా ఓట్లు వేశారు. డిఆర్‌ఈయుతో పాటు సీఎల్‌డబ్ల్యూఎల్‌యూ రెండూ ఇప్పుడు రైల్వే కార్మికులను సంఘటితం చేయటంలో ప్రత్యామ్నాయాలుగా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ప్రయివేటీకరణ, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌), యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్‌)ని నిరోధించడంతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సంఘాలతో కలిసి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కోసం ప్రయత్నించడం ఇప్పుడు వాటి ముందున్న ప్రధాన లక్ష్యం.
అనువాదం : పద్మశ్రీ, 9490098687
ఆర్‌.ఇలంగోవన్‌