నీలాకాశం నీలంగా వుంది. నీలం పైకప్పు కింద రామ్‌రాజ్ లుంగీల్లా ఎగురుతూ పరుగెడ్తున్నాయి తెల్లటి పలుచటి మేఘాలు. కొన్ని ‘సీన్లు’ చేంజవడానికి ఆట్టే సమయం పట్టదు. పలుచటి తెల్లటి మేఘాలు క్రమంగా నలుపెక్కాయి. ఎంత నలుపంటే ఇది వరకు ఇవింత తెల్లగా వుండేవని ఎవరూ నమ్మనంత. నలుపెక్కిన మేఘాలు, నల్లబడ్డ మబ్బులు క్రమంగా బరువెక్కాయి కూడా. బరువెక్కిన నల్లని మబ్బులు ఇది వరకటిలా పరుగెత్తలేక నత్తనడక మొదలు పెట్టినయి.
బరువెక్కిన నల్లని మబ్బులు ఆకాశంలో ఓ వైపు కదలకుండా నించున్నాయి. మరో వైపు నుంచి వచ్చిన మరో నల్లమబ్బుల గుంపు వాటికి ఎదురైంది. ఇంకేం వుంది, ఈ గుంపూ, ఆ గుంపూ ఒకళ్లకేసి ఒకళ్లు కోపంగా చూసుకున్నాయి. ఈ మబ్బులూ ఆ మబ్బులూ ఢ కొట్టుకుందుకు రెడీ అయినాయి. నువ్వా? నేనా? అనుకున్నాయి. అంతే నల్లమబ్బులు… నల్లమబ్బులు ఢ అన్నాయి. అడవి దున్నల్లా ఒక్కదాన్నొకటి కుమ్ముకున్నాయి. కమ్ముకున్నాయి. కమ్ముకున్న నల్లమబ్బుల మధ్య ఇంద్రుడి వజ్రాయుధం తళుక్కుమని మెరిసింది. మెరిసిన మెరుపు వెనుక నుంచి అర్జునుడి గాంఢవీం గర్జించింది.
నల్లమబ్బుల్లో దాక్కుని వున్న సముద్రం జలజలమని నేలకు దిగి రాసాగింది. చినుకులు వందలు, వేలు, లక్షలైనాయి. లక్షల చినుకులు జల్లులైనాయి. జల్లులైన చినుకులు హోరుగాలి గుర్రాలెక్కి జడివానలైనాయి. జడివానలు ఏనుగు తొండాల్లోంచి కురిసి కుంభవృష్టిగా మారినాయి.
వాగులూ, వంకలూ, చెరువులూ నిండినాయి. వాగుల్లో వంకల్లో, చెరువుల్లో కుంభవృష్టిగా కురిసిన నీళ్లకు చోటు చాలలేదు. చోటు చాలని నీళ్లు వరదలై పొంగి పొర్లినాయి. పొంగి పొర్లిన నీళ్లు ఊళ్లోకి పరుగెత్తాయి. ఊళ్లోకి వచ్చిన నీళ్లు ఇళ్లల్లోకి రాక తప్పలేదు. రోడ్లంట పిచ్చిగా పరుగెత్తక తప్పలేదు. రోడ్లు కాలవలైనాయి. కాలువలు కుంటలైనాయి.
జోరువానకు కిటికీలు ఢమాల్‌మన్నాయి. ధణేమన్నాయి. శ్రీకర్ సగం తెర్చుకున్న కళ్లు సగం విరుచుకున్న వొళ్లు కిటికీ దగ్గరికి పరుగెత్తి కిటికీ తలుపులు మూసేసి మళ్లీ మంచం మీద ఒరిగేసినాయి. శ్రీకర్ అనగా శ్రీకరుడు భవహరుడు కాదు, శ్రీకరే. శ్రీకర్ అనగా మామూలు మనిషే. మామూలు మనిషే అయినా చంటిపాపలా ‘లాప్‌టాప్’ను మోసుకుంటూ తిరిగే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
వాగులూ, వంకలూ, చెరువులూ వదిలి ఊళ్లోకి వచ్చిన నీళ్లకు ఎటు పోవాలో అర్థం కాలేదు. దిక్కులు తెలియలేదు. నిజం సంగతేమో కాని నీరు పల్లమెరుగు అనుకుంటూ ఎక్కడ గొయ్యి వుంటే అక్కడికి, ఎక్కడ జరజరా జారడానికి వీలుంటే అక్కడికి అలా ఎక్కడికి పోవాలో, పోతున్నామో తెలీకుండా పోతూనే వున్నాయి.
చిరుజల్లుకే ముఖం మాడ్చే వీధి లైట్లు ఎప్పటిలాగే ముఖాలు మాడ్చుకున్నాయి. ఎక్కడ ఎన్ని నీళ్లున్నాయో, ఎక్కడ నోరు తెరిచిన డ్రైనేజీలున్నాయో అర్థం కాని జనం, అయోమయంలో జనం ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడడానికి హారన్ మోతలతో ధ్వని కాలుష్యానికి చేతనయినంత కృషి చేస్తున్నారు. అంగుళం కదలకుండా బుర్రుమనే వాహనాలు కొన్ని.
ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తున్న శ్రీకర్‌ను వర్షం కొండచిలువలా చుట్టుకుంది. ట్రాఫిక్ అనకొండలా భయపెట్టింది. చీకటి కనిపించకుండా వినిపించేట్టు నవ్వింది. ఈ ట్రాఫిక్‌లోంచి బతికి బట్టలు తడిసి ఒళ్లు పులిసి ఎప్పటికి చేరగలనో ఇంటికి అనుకుంటూ అరగంటకో గజం చొప్పున కదుల్తున్నాడు శ్రీకర్, కాలినడకన కాదు ‘బైకు’ మీద. అవును, ఏ గోతిలో పడతాడో తెలీదు. ఏ మూత లేని డ్రైనేజీ వెల్‌కం శ్రీకర్ అంటుందో తెలీదు.
శ్రీకర్‌కు తన బైకు పక్కన నీళ్లల్లో ఏదో చప్పుడు వినపడింది. అది వాహనం మాత్రం కాదు. ముందూ వెనుకా వున్న వాహనాలు దూరంగా వున్నాయి. మరి తన పక్కన కదులుతున్నదేమిటో అర్థం కాలేదు, అంతుచిక్కలేదు. ఎక్కడ్నించో వచ్చి వాలిన వెలుతురులో కళ్లు విప్పి చూసే నాలుకాళ్ల జీవమొకటి బల్లిలా పాకుతూ వస్తున్నది కానది బల్లి కాదు, ఆ గుచ్చుకుంటున్న వాన చినుకుల సూదుల వల్ల ‘స్ట్రయిక్’ కాలేదు కాని తర్వాత మెదడు లాగిపెట్టి కొట్టింది. అది తనతో పాటు అడుగులో అడుగు వేస్తున్న క్రొకడైల్. ఆ మాటే అరుపుగా నోటినుంచి బయటకు దూకేసింది. అవును, కొరికే డైల్‌నే అన్న మాట వినిపించి చుట్టూ చూశాడు. ఎవరూ లేరు, ఒక్క మొసలి అనబడే మకరి తప్ప. దిక్కులు చూడకు మానవా మాట్లాడింది కొరికే డైల్‌నే.
అదిరి బండిమీద వున్నాడు కనుక పడకుండా నిలదొక్కుకుని అడిగాడు… నీళ్లల్లో వుండాల్సిన మొసలివి ఇక్కడా?’ అన్నాడు.
కిందా పైనా నీళ్లుండి నోట్లో నమలడానికి లేక. ఏం చేస్తాం, మా కొంపల్లో మమ్మల్ని ఉండనివ్వరు కదా. చెరువుల జాగా మొత్తం ఆక్రమించి కాలనీలు కట్టుకుంటే వుండడానికి చోటు లేక నీళ్లు రోడ్డు మీద పడ్తున్నాయి. వాటిని అంటిపెట్టుకుని వున్న మేమూ రోడ్ల మీద పడుతున్నాం. వరదనీటిలో మునకేస్తున్న ఇళ్లల్లో పాములు తల దాచుకుంటున్నాయి. మేం కొంపల్లో దూరలేక రోడ్ల మీద ట్రాఫిక్‌తో పాటు ఈదులాడ్తున్నాం అన్నది మొసలి నోటి నిండా వున్న పళ్ల సెట్టు తెరిచి.
నోరు బార్లా తెరుస్తున్నావు, డిన్నర్ చెయ్యలేదా అనాలనుకున్నాడు శ్రీకర్. కానీ సౌండ్ రాలేదు. అర్థమైందిలే నీ మనసులోపలి మాట. తిండి సంగతి మరిచిపొయ్యి ఇట్లా కొట్టుకుపోతున్నాం. ఓ పక్కన ఐక్యా, ఓ పక్కన హైటెక్ సిటీ, వారెవా నగరాన్ని పెంచుకుంటూ పోతున్నారు తప్ప చెరువుల్ని రోడ్డు మీదికి రాకుండా, ట్రాఫిక్ జాంలు లేకుండా నాలాంటి మొసళ్లు రోడ్ల మీద ఈదకుండా చెయ్యలేకపోతున్నారు. మా కొంపలు కూల్చి మా పొట్ట కొడ్తున్న మిమ్మల్ని నమలకుండా మింగాలి అంటూ నీళ్లల్లో కదల్లేక పోతున్న బండి మీద వున్న శ్రీకర్ కాలు అందుకుంది మొసలి. ‘చాచ్చాన్రా బాబూ’ అంటూ మంచం మీదినుంచి కిందపడ్డ శ్రీకర్ కల చెదిరింది, కాలు మిగిలింది.
– చింతపట్ల సుదర్శన్, 9299809212