వానొస్తుందంటేచాలు
మా వాడల పొంటి గుడిసెకున్న తాటాకు మట్టలు
కొట్టుకపోతాయని దిగులు
తడిసిన మట్టిగోడలు కూలిపోయి
పసికందులు మరణిస్తారనీ బుగులు
వానొస్తే..మట్టిమిద్దెలమీద గడ్డినిదీసి
కొట్టుకపోయిన మట్టిని గంపలకొద్ది మోసుకొచ్చి
ఒరిగిన కట్టెవాట్లకు దూలాలను అనిచ్చి
ఇంటిని కాపాడుకోవాలనే పేదోడి కన్నీటి కావ్యం
మధ్యరాత్రి వానకు
బొట్లు బొట్లుగా ఇల్లు కారుతుంటే
తలెలు, గ్లాసులు, గిన్నెలు నిండిపోయినాక
దోసిలినింపి వాననీటిని పారబోస్తుంటే
నిద్రబోని దినంగా మా గుండెల్లో గుర్తుండే రాత్రి కథ
వానలో పచ్చికట్టెలను మట్టిపొయ్యిలపెట్టి
ఊది ఊది ఊపిరంత పొగొట్టుకొని
పిడికెడు బువ్వవండి ఇంటంతమంది
కడుపు నింపాలని పడే ఎందరో తల్లుల ధీనత్వం
జడివానలోనే
గోనె కొప్పెరను తగిలించుకొని
సేన్ల తుమ్మకొమ్మలకింద కట్టేసిన
ఎద్దులకు ఏ ఉరుము పడి ఏమౌతుందోననీ
భయపడి ఇంటికి తీసుకొచ్చే రైతన్నల వేదన
వాన..బయటొక్కటే కాదు
పేదోడి లోపల, లోలోపల ఎప్పటికీ ఎడతెగని వాన
కురుస్తనే ఉంటది…
-అవనిశ్రీ
9985419424