– చెరువులను తలపిస్తున్న పరిశ్రమలు
– ఉత్పత్తుల నిలిపివేత.. రోడ్డున పడ్డ కార్మికులు
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
గడ్డపోతారం పారిశ్రామిక వాడలో వర్షాలు వస్తే పరిశ్రమలు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా కొంత మంది రహదారులను కబ్జా చేయడంతో.. డ్రయినేజీ లేక రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమల్లో నీరు నిలవడంతో పరిశ్రమ యాజమాన్యాలు ఉత్పత్తులను నిలిపివేశాయి. యూనిసాక్స్, బూడిద పరిశ్రమ, స్టాండర్డ్ గ్లాస్సెస్, మెట్రో కెం మరికొన్ని పరిశ్రమల్లో పూర్తిగా ఉత్పత్తులను నిలిపివే శారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో వందలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ విషయమై పరిశ్రమ యాజమాన్యాలు అధికారులకు మొరపెట్టుకున్నా.. స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను పున రుద్ధరించి పరిశ్రమల్లో ఉత్పత్తులకు ఎలాంటి విఘాతం కల గకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.