లంక ప్రిమియర్‌ లీగ్‌కు రైనా

వేలం బరిలో ఉన్న ఆటగాళ్ల జాబితాలో చోటు
కొలంబో: టీమిండియా మాజీ ప్లేయర్‌, ఐపీఎల్‌ లెజెండ్‌ సురేష్‌ రైనా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరిగే లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌) వేలంలో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు. కనీస ధర 50 వేల డాలర్ల ధరతో అతను ఈ వేలం బరిలో దిగుతున్నట్లు సమాచారం. శ్రీలంక క్రికెట్‌ బోర్డు.. ఈ వేలంలో పాల్గొనే అంతర్జాతీయ, దేశీయ ఆటగాళ్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో రైనా పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లంక ప్రీమియర్‌ లీగ్‌లో టీమిండియా లెజెండరీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆడాడు. అయితే ఈ ఏడాది తొలిసారి తాము కూడా ప్లేయర్ల వేలం నిర్వహించాలని లంక బోర్డు నిర్ణయించింది. ఈ వేలంలో రైనా కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో చెలరేగిన రైనా ఈ లీగ్‌లో కూడా అద్భుతంగా ఆడతాడని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.