– భారత్, సఫారీ తొలి టీ20 రద్దు
– ఎడతెగని వర్షంతో పడని టాస్
నవతెలంగాణ-డర్బన్
దక్షిణాఫ్రికాలో టీమ్ ఇండియా పర్యటన వరుణుడి ఆటతో మొదలైంది. టీ20, వన్డే, టెస్టు సిరీస్ కోసం సఫారీ గడ్డపై కాలుమోపిన భారత జట్టు.. 2024 టీ20 ప్రపంచకప్ సన్నాహకంలో కీలక మ్యాచ్ ప్రాక్టీస్‌ను కోల్పోయింది. తొలి టీ20 వేదిక డర్బన్‌లో మ్యాచ్ సమయానికి గంట ముందు నుంచే ఎడతెగని వర్షంతో.. కనీసం టాస్ కూడా సాధ్యపడలేదు. వర్షం నిలకడగా కొనసాగటంతో తొలి టీ20ని రద్దు చేస్తూ ఫీల్డ్ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ మంగళవారం జరుగనుంది.
అభిమానులకు నిరాశ
అగ్ర జట్టు భారత్ రాకతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఖజానా నింపుకునే పనిలో నిమగమైంది. అందులో బోర్డు పూర్తిగా విజయవంతమైంది. డర్బన్ టీ20 మ్యాచ్‌కు ఓ నెల రోజుల ముంగిటే టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. భారత జట్టు మూడు ఫార్మాట్ల పర్యటనతో సుమారు రూ.450 కోట్లు ఆర్జించేందుకు రంగం సిద్ధం చేసుకున్న దక్షిణాఫ్రికాకు.. ఆరంభం కలిసి రాలేదు. హౌస్‌ఫుల్ స్టేడియం.. వర్షం రాకతో నిరుత్సాహానికి గురైంది. టీమ్ ఇండియా అభిమానులు వర్షంలోనూ మ్యాచ్‌పై ఆశలు పెంచుకున్నారు. మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చే వరకూ ఓపిగ్గా స్టేడియంలోనే ఎదురుచూశారు. అయితే, వర్షం తగ్గే సూచనలు ఏమాత్రం లేకపోవటంతో ఇరు జట్ల క్రికెటర్లు డ్రెస్సింగ్‌రూమ్‌కు మాత్రమే పరిమితమయ్యారు. మ్యాచ్ రద్దు కావటంతో అభిమానులకు టికెట్ల సొమ్మును సపారీ క్రికెట్ బోర్డు 100 శాతం తిరిగి చెల్లించనుంది.
అనూహ్యంగా వరుణుడు
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తొలి టీ20కి వర్షం ముప్పు లేదు. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం వరకు వర్షం సూచనలు ఉన్నాయి. కానీ మ్యాచ్ సమయానికి వాతావరణం క్లియర్‌గా ఉందని తొలుత తెలిపింది. ఉదయం చిరుజల్లులు తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు అనుకూలిస్తుందనే అంచనాతో స్టేడియానికి వచ్చిన క్రికెటర్లకు.. వరుణుడు షాక్ ఇచ్చాడు. టాస్ ముంగిట వర్షం షురూ కావటంతో.. అటు ఆటగాళ్లలో, ఇటు అభిమానుల్లో ఆందోళన మొదలైంది. చివరకు 5 ఓవర్ల మ్యాచ్‌కు సైతం వాతావరణం అనుకూలించే పరిస్థితులు లేకపోవటంతో ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రద్దు నిర్ణయం తీసుకున్నారు.