– భారత్- న్యూజిలాండ్ తొలి టెస్టు
బెంగుళూరు : బెంగుళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. భారీ వర్షం కారణంగా తొలుత తొలి రెండు సెషన్ల ఆటను రద్దు చేసిన అంపైర్లు టి విరామం తర్వాత మూడో సెషన్ ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి చిన్నస్వామి స్టేడియంలో కవర్స్ కప్పి అలానే ఉంచారు. బుధవారం రోజంతా అడపాదడపా జల్లు కురుస్తూనే ఉంది. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఇండోర్ ప్రాక్టీస్ చేశారు. టీ బ్రేక్ తర్వాత.. పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం టాస్ వేసేందుకు కూడా అవకాశం దక్కలేదు. బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తుండడంతో రెండోరోజు ఆట అయినా సజావుగా సాగుతుందా? లేదా? అనేది సందేహాస్పదమే. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ జట్టు గత ఐదు టెస్టుల్లో 4 మ్యాచ్‌లలో ఓడిన నిరాత్సాహంలో ఉండగా.. భారత జట్టు బంగ్లాదేశ్‌పై క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఈ సిరీస్‌కు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండా భారతజట్టు వరుసగా మూడోసారి డబ్ల్యూటిసి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంటుంది.