– తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు పసుపురంగు హెచ్చరికను జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ రాబోయే 48 గంటల పాటు ఎక్కువ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఆగేయం దిశ నుంచి ఉపరితల గాలులు వీచే అవకాశముంది. అక్కడక్కడా తేలికపాటి వర్షం, చిరుజల్లులు పడే సూచనలున్నాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు 43 ప్రాంతాల్లో వర్షం కురిసింది. బజార్ హత్నూర్‌లో అత్యధికంగా 2.95 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆదిలాబాద్, కొమ్రంభీం అసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో వానపడింది. వారం రోజులుగా 30కిపైగా జిల్లాల్లో 41 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు ఒకటెండ్రు డిగ్రీల మేర తగ్గాయి. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
బజార్‌హత్నూర్(ఆదిలాబాద్) 2.95 సెంటీమీటర్లు
లోనవల్లి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 2.68 సెంటీమీటర్లు
తాళ్లమడుగు(ఆదిలాబాద్) 2.08 సెంటీమీటర్లు
సిరికొండ(ఆదిలాబాద్) 2.00 సెంటీమీటర్లు
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
వడ్డేపల్లి (జోగులాంబ గద్వాల) 40.3 డిగ్రీలు
ధరూర్(జోగులాంబ గద్వాల) 40.0 డిగ్రీలు
తిమ్మన్నదొడ్డి(జోగులాంబ గద్వాల) 40.0 డిగ్రీలు
కన్నాయిపల్లి(వనపర్తి) 39.9 డిగ్రీలు