నిఘా నేత్రాలు పెంచండి

– ఎక్కడి పోలీసులు అక్కడే వద్దు
– సీ-విజిల్‌కు విస్త్రుత ప్రచారం ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల బృందం దిశానిర్దేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్నికల ప్రచారం, పోలీసు బందోబస్తు, పోలింగ్‌, కౌంటింగ్‌ సహా అన్నింటిపై వీడియో కెమెరాల నిఘాను పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందం రాష్ట్ర అధికారుల్ని ఆదేశించింది. సెల్‌ఫోన్లతో వీడియోలు తీయోద్దనీ, కచ్చితంగా వీడియో కెమెరాలనే వినియోగించాలని స్పష్టంచేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో సోమవారం వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, పోలీసు శాఖలకు చెందిన అధికారులతో సీఈఓ వికాస్‌రాజ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమీషనర్‌ అజరు బాదూ, డైరెక్టర్‌ (వ్యయం) పంకజ్‌ శ్రీవాస్తవ్‌, ప్రత్యేక వ్యయ పరిశీలకులు బాలకష్ణన్‌ మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్లపై వారు పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసులు, ఆ కేంద్రాల పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు… చేయాల్సిన పనులు, చేయకూడని పనులతో రాష్ట్ర పోలీస్‌ నోడల్‌ అధికారులు ప్రత్యేక జాబితా రూపొందించి ఇవ్వాలని సూచించారు. రాజకీయ కార్యక్రమాలను వీడియోలు తీయడంపై అన్ని వీడియో నిఘా బృందాలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి పెండింగ్‌లోని 6వ నంబరు ఫారాలను నవంబర్‌ 10వ తేదీ లోగా పరిష్కరించాలని చెప్పారు. ప్రతి జిల్లాలో ఓటర్ల జాబితాపై వచ్చిన కంప్లయింట్‌లను ఫిర్యాదుదారు ఫోన్‌ నంబర్‌తో సహా నమోదు చేసి, ర్యాండమ్‌గా క్రాస్‌ చెక్‌ చేసి ధృవీకరించుకోవాలని చెప్పారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు తమ మొబైల్‌ ఫోన్లలో సీ-విజిల్‌ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు రిటర్నింగ్‌ అధికారులు నిర్ధారించుకోవాలని అన్నారు. సీి-విజిల్‌ యాప్‌కు రాష్ట్ర స్థాయి వార్తాపత్రికల్లో ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల బయట వీడియోగ్రఫీ ఫుటేజ్‌ను పోలీసు కంట్రోల్‌ రూమ్‌లతో అనుసంధానించాలని తెలిపారు. పోలింగ్‌ రోజున మీడియా చానళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలనీ, ప్రతికూల వార్త ప్రసారమయితే, నోడల్‌ అధికారి వెంటనే వాస్తవ వివరాలను తెలుసుకొని, వాటిని తిరిగి సంబంధిత చానళ్లకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని చెప్పారు. అంతకుముందు సీఈఓ వికాస్‌రాజ్‌ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.