– ఎంపీ ఈటలకు ఎస్కేఎం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోక్‌సభలో లెవనెత్తాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) రాష్ట్ర బృందం ఎంపీ ఈటల రాజేందర్‌ను కోరింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయనకు ఎస్‌కేఎం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు మూడ్ శోభన్ తదితరులు వినతిపత్రాన్ని అందజేశారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీి) సీ2 ప్లస్ 50 శాతం ప్రాతిపదికన ఇచ్చేందుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలను గ్యారంటీగా సేకరించాలని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులందరికీ నెలకు రూ.10 వేలు చొప్పున పెన్షన్ ఇవ్వాలనీ, భూసేకరణ, పునరావాస చట్టం-2013ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో సమగ్ర రైతురుణ మాఫీ చేయాలని కోరారు. విద్యుత్ ప్రయివేటీకరణను ఆపాలనీ, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దన్నారు. అన్ని పంటలకు, పశుపోషణకు సమగ్ర బీమా కవరేజీ ఇవ్వాలన్నారు.