– సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీ శంకర్
నవతెలంగాణ-కల్చరల్
రెండు వందల సంవత్సరాలకు పూర్వమే భారతీయ సమాజంలో ఉన్న పలు రుగ్మతలు దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రాజా రామ మోహన రాయ్ తదుపరి కాలం సంఘ సంస్కారణాభిలాషులకు మార్గదర్శిగా నిలిచారని సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. శ్రీ త్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై జరుగుతున్న దశాబ్ది పూర్వ మహనీయులు యాదిలో కార్యక్రమాల్లో భాగంగా రాజా రామమోహన రారు సంస్మరణ సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా గౌరీ శంకర్ పాల్గొని మాట్లాడుతూ ఎక్కడో బెంగాల్‌లో పుట్టిన రామమోహన్ రాయ్ నాడు స్త్రీల పట్ల జరుగుతున్న దుర్మార్గ ఆచారంపై పోరాడి సతీసహ గమనంకు వ్యతిరేకంగా నాటి ప్రభుత్వం చట్టం చేసే విధంగా చేశారన్నారు. ఆ స్ఫూర్తి తోనే తెలుగునాట కందుకూరి వీరేశలింగం మహిళల అభ్యుదయానికి ఉద్యమించారని, సాంఘీక, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా విప్లవాలు నాంది పలికారన్నారు. దశాబ్ది కాలంలోనే శతాబ్ది కాలపు అభివృద్ధి ముఖ్యమంత్రి కే.సి.ఆర్ నాయకత్వాన తెలంగాణలో జరిగిందని జూన్ 2 నుంచి జరిగే దశాబ్ద వేడుకల్లో సాహిత్య, జానపద, శాస్ట్రీయ కళా ప్రదర్శనలతో గాన సభ కూడా భాగస్వామి కావాలని గౌరీ శంకర్ కోరారు. ఇందుకు స్పందించిన గాన సభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి తెలంగాణ ప్రభుత్వం గాన సభను కూడా పరిగణలోకి తీసుకుని ఉత్సవాలకు తగిన సహకారం అందించాలని కోరారు. జర్నలిస్టు జయ సూర్య మాట్లాడుతూ ఇస్లాం,క్రిస్టియన్ హిందు మతాలను సమగ్ర అధ్యయనం చేసిన రామ్‌మోహన రాయ్ ఏకేశ్వరోపాసనను ప్రతిపాదించారని, మతం లో మానవీయత లేదని, హిందు మతం లోని సతీసహగమనం పై యుద్ధమే చేసి ఆ ఆచారాన్ని అంతం చేసిన రారు భారతీయ ఔన్నత్యాన్ని సైతం 250 ఏండ్ల క్రితమే చాటారని వివరించారు. డాక్టర్ కే.వీ.రావు ఆత్మీయ నిర్మల వేదిక పై పాల్గొన్నారు.