తెలుగు సినీ వినీలాకాశంలో అలరారించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేక ముద్రను వేసి ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోయిన నటుడు రాజబాబు. ‘రాజబాబు’ ఈ నాలుగక్షరాల పేరు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ ఎలిమెంట్! ప్రేక్షకులకు నవ్వులు పంచే యంత్రం. ‘నవ్వు నలభై విధాల గ్రేటు’ అన్నది రాజబాబు చెప్పిన మంత్రం. రాజబాబు తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించాడు. ఆయన తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. రాజబాబు ఉంటే సినిమాకెళ్లొచ్చు అనే ప్రేక్షకులను సంపాదించుకున్న రాజబాబు నాటి టాప్ స్టార్స్‌కు సమానంగా పారితోషికం పుచ్చుకుని, స్టార్ కమెడియన్‌గా రాణించి, తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు హాస్యనటుడిగా ఓ వెలుగు వెలిగి, శతాబ్దపు హాస్యనటునిగా ప్రశంసలు పొందాడు. దాదాపు 600 వందలకు పైగా సినిమాలలో నటించిన రాజబాబు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సినీ ఇండిస్టీలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. రాజబాబు వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడుగా చరిత్రపుటల్లో నిలిచాడు. ఈ నెల 20 న ‘నవ్వుల రారాజు రాజబాబు’ జయంతి సందర్భంగా ‘సోపతి’ పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.
రాజబాబు 1937 అక్టోబర్ 20న పశ్చిమగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించాడు. పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ ఆయన తల్లిదండ్రులు. రాజబాబుకు నలుగురు తమ్ముళ్ళు, ఐదుగురు అక్కాచెల్లెళ్ళు. రాజబాబు బాల్యం నుంచీ తన చేష్టలతో జనానికి వినోదం పంచేవాడు. అప్పలరాజును అందరూ ముద్దుగా రాజాబాబు అంటూ పిలిచేవారు. తరువాతి రోజుల్లో నాటకాల్లో ఆ పేరుతోనే నటించాడు రాజబాబు. ఇంటర్మీడియట్ కాగానే టీచర్ కోర్సు పూర్తిచేసి, కొంతకాలం ఉపాధ్యాయ వత్తిలో చేరాడు. ఆ సమయంలో నాటకాలు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనేవాడు. రంగస్థలంపై ఆయన ‘నాలుగిళ్ళ చావిడి, కుక్కపిల్ల దొరికింది’ వంటి నాటకాలతో పేరు సంపాదించాడు. గరికపాటి రాజారావు ఓ సారి రాజబాబు నటించిన నాటకం చూడటం జరిగింది. రాజబాబులోని టైమింగ్ రాజారావును ఆకట్టుకుంది. దాంతో ఆయన రాజబాబును మద్రాసు రమ్మని చెప్పారు. అలా రాజబాబు మద్రాసులో అడుగుపెట్టాడు. మద్రాసు చేరుకోగానే ఆయనకి సినిమాల్లో నటించే అవకాశం రాకపోవడంతో మిమిక్రీ చేస్తూ, ట్యూషన్స్ చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు చేశాడు. నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావు పిల్లలకు ట్యూషన్స్ చెప్పే రాజబాబులోని హాస్య చతురతను చూసి తాను తీసిన ‘సమాజం’ సినిమాలో అవకాశం కల్పించారు.
సినీరంగ ప్రవేశం
రాజబాబు 1960లో ‘సమాజం’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన తర్వాత రావికొండలరావు, గరికపాటి రాజారావుల ప్రోత్సాహంతో మద్రాసులో సైతం రంగస్థలం మీద చిన్న,చిన్న వేషాలు వేసాడు. ‘సమాజం’ చిత్రం తరువాత కొన్ని చిత్రాలలో కనిపించిన రాజబాబుకి ‘కులగోత్రాలు’, ‘స్వర్ణగౌరి’, ‘మంచి మనిషి’ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. రాజబాబు ‘స్వర్ణగౌరి’ చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించాడు. జగపతి సంస్థ ‘అంతస్తులు’ చిత్రం ఆయన నటనాజీవితాన్ని మలుపు తిప్పింది. ‘అంతస్తులు’ చ్రిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందాడు. ఆ తర్వాత రాజబాబు వెనుతిరిగి చూడలేదు. బిజీ అయిపోయాడు. ఒకదశలో రోజుకు రెండు, మూడు షిప్టులు పని చేసాడు. ‘బందిపోటు, మంచి మనిషి’ వంటి చిత్రాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. అప్పట్లో పద్మనాభం, చలం వంటివారు కమెడియన్స్ గా రాజ్యమేలుతున్నారు. వారి మధ్య రాజబాబు రాణించడం కష్టం అని చాలామంది అనుకున్నారు. అయితే రాజబాబు వారికి భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకొని నవ్వించడం మొదలెట్టారు. సి.పుల్లయ్య రూపొందించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’లో పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి మేటి నటులతో కలసి రాజబాబు తనదైన పంథాలో పకపకలు పంచారు. ఆ సినిమాతోనే రాజబాబుకు మంచి గుర్తింపు లభించింది. యన్టీఆర్ ‘ఆత్మబంధువు’లో సూర్యకాంతం కొడుకుగా నటించి, ఆకట్టుకున్నాడు. తెరపై రాజబాబు కనిపిస్తే చాలు అందరి మొహాల్లో చిరునవ్వే కనిపించేది. ఆ నాటి మేటి హీరోలందరి చిత్రాలలోనూ రాజబాబు హాస్యం తప్పనిసరిగా ఉండేది. తెరపై రాజబాబు, రమాప్రభ జోడీ అనేక చిత్రాలలో ఎంతగానో నవ్వులు పూయించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘తాత-మనవడు’లో తాతగా ఎస్వీ రంగారావు, మనవడుగా రాజబాబు నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు హీరోగా ‘తిరపతి, ఎవరికి వారే యమునా తీరే’ వంటి చిత్రాలు రూపొందాయి. ‘పిచ్చోడి పెళ్ళి, మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి చిత్రాల్లోనూ రాజబాబు హీరోగా నటించారు. ‘బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్’ పతాకంపై రాజబాబు చిత్రాలు నిర్మించారు. ఈ పతాకంపై రూపొందిన చిత్రాలలో ‘ఎవరికి వారే యమునా తీరే’ మంచి విజయం సాధించగా, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘రాధమ్మ పెళ్ళి’ చిత్రంలో రాజబాబు, రమాప్రభ స్వయంగా ”కాకినాడ రేవు కాడా ఓడెక్కి” సాంగ్ పాడటం విశేషం. అంతే కాకుండా, కొన్ని పాటల్లో రాజబాబు స్వయంగా గళం వినిపించినవీ ఉన్నాయి. రాజబాబు కమెడియన్ గా ఒక స్థాయిని అనుభవిస్తున్న సమయంలోనే హీరోగా కూడా ప్రయోగాలు చేశాడు. ‘తాతా మనవడు’, ‘పిచ్చోడి పెళ్ళి’, ‘తిరుపతి’, ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ లాంటి సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు.
హీరోలకంటే ఎక్కువ రెమ్యునరేషన్
బ్లాక్ అండ్ వైట్ కాలంలో కామెడీ పాత్ర అంటే దర్శక నిర్మాతలకు వెంటనే గుర్తొచ్చే పేరు రాజబాబు. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అందుకే కొన్నాళ్ల తర్వాత రాజబాబు కామెడీ అనేది సినిమాల్లో సెంటిమెంట్‌గా మారిపోయింది. ఎంతలాగా అంటే రాజబాబు ఉంటే సినిమా హిట్టే అనుకునేంతలాగా.. ఎన్‌టీఆర్, రాజబాబు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఒక సినిమా సమయంలో ఎన్‌టీఆర్ పారితోషికం రూ.35 వేలు కాగా రాజబాబుకు రూ.20 వేలు అని అనుకున్నారు. కానీ రాజబాబు మాత్రం ఎన్‌టీఆర్‌తో సమానంగా తనకు కూడా రూ.35 వేలు పారితోషికం కావాలని పట్టుపట్టారట. దానికి నిర్మాత ఒప్పుకోకుండా ‘ఎన్‌టీఆర్ హీరో.. మీరు కమెడియన్’ అని అన్నారట. అప్పుడు రాజబాబు ‘అయితే హీరోనే కమెడియన్‌గా పెట్టి సినిమా తీయండి’ అని సమాధానం చెప్పారట. దానికి నిర్మాత ఏమీ మాట్లాడకుండా రాజబాబు అడిగిన పారితోషికానికే సినిమాను ఒప్పుకున్నారట. ఇది మాత్రమే కాదు.. ఇంకా చాలా సందర్భాల్లో రాజబాబు హీరోలతో సమానంగా పారితోషికాన్ని అందుకుని స్టార్ హీరోల కన్నా కూడా ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. రాజబాబు ఒకానొక సమయంలో ఎంత బిజీ అయ్యారంటే ఆయన కేవలం రోజులో గంట మాత్రమే ఒక సినిమాకు కాల్ షీట్ కేటాయించేవారట. మరొక గంట మరొక సినిమాకు ఇచ్చేవారట.
మీ సినిమాలో ఉండాల్సిందే అని డిమాండ్ చేసిన నటుడు
రాజబాబు నటుడిగా వేషాలు వేస్తున్నప్పటికే 1980లలోకి వచ్చేసరికి అవకాశాలు తగ్గాయి.. రోజుకి 18 గంటలు పని చేసి ఖాళీగా ఉండాలంటే అది ఒక శాపం లాంటిది.. అందుకని తనకి బాగా తెలిసిన నిర్మాతలకు, దర్శకులకు ఫోన్ చేసి నేను మీ సినిమాలో ఉండాల్సిందే అని డిమాండ్ చేసేవాడు. వారు కూడా కాదనకుండా తమ సినిమాలో ఏదో ఒక క్యారక్టర్ సృష్టించేవారు. ఆలా వేసిన వేషాల్లో ఒకటి అల్లూరి సీతారామరాజులో పోలీస్ ఇన్‌స్పెక్టర్. స్టేషన్ ఇన్‌చార్జ్ సీతారామరాజు వచ్చినప్పుడు ఆయుధాలన్నీ రామరాజుకి అప్పజెప్పుతాడు. తర్వాత కూడా రెండు సీన్స్ క్రియేట్ చేసి రామరాజు స్థావరానికి వచ్చే సీన్స్ ఉంటాయి.. తరవాత మరికొన్ని సినిమాలు చేసాడు. నేను అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసిన భోగిమంటలు సినిమాకి త్రిపురనేని మహారథి గారు రచయిత. ఆయనకి ఫోన్ చేసి ”బాబారు.. నేను మీ సినిమాలో లేకపోతె అవమానం నాకు కాదు, మీకే. మీకు అవమానం జరిగితే నేను తట్టుకోలేను.. కాబట్టీ నేను మీ సినిమాలో వుండేలాచేసుకోండి” అని ఆర్డర్ వేసాడు. మహారథికి కూడా రాజబాబు అంటే చాలా ఇష్టం. వెంటనే ఆయన అప్పలాచార్యని పిలిపించి జయమాలిని, నూతన్ ప్రసాద్, రాజబాబు ల మీద ఒక కామెడీ ట్రాక్ రాయించి అవకాశం కలిపించారు.
రాజబాబు, రమప్రభ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్
టాలీవుడ్ లో రాజబాబు, సీనియర్ నటి రమాప్రభ కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరి జోడీ మంచి హాస్య జంటగా పేరు తెచ్చుకుంది. వారిద్దరూ కలిసి జంటగా ఎన్నో సినిమాలలో నటించారు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలలో ఈ జంట చేసే కామెడీ బాగా పేలేది. వీరిద్దరు సినిమాలో జోడిగా నటిస్తున్నారు అంటే వీరికోసమే థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు కూడా ఉండేవారు. అలాంటి అరుదైన అభిమానం ఈ జంట సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి చివరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థాయికి వచ్చిందని కూడా అప్పట్లో గుసగుసలు ఉండేవి. రమాప్రభ మంచి అందగత్తె. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత పెద్ద దర్శకుడు అయినా సినిమా తీయాలంటే ముందుగా రమాప్రభ, రాజబాబులకు అడ్వాన్స్ ఇవ్వమని చెప్పేవారట. అంటే ముందుగా ఈ ఇద్దరిని సినిమాకు బుక్ చేసిన తర్వాతే మిగిలిన హీరో, హీరోయిన్లు ఇతర నటీనటులను బుక్ చేసేవారట. దీనిని బట్టి ఈ జంట కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ సాదించిందో తెలుస్తోంది. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రాల షూటింగ్ చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ జరిగేది. దీంతో ఆ మూడు నెలలపాటు వీరిద్దరూ కలిసి సినిమాలలో నటించడం.. ఒకే కారులో వెళ్ళటం, కలిసి ప్రయాణించటం.. చివరకు ఒకే రూమ్‌లో ఉండటం కూడా జరిగింది. అలా మూడు నెలల పాటు వీరిద్దరూ కలిసి మెలిసే ఉన్నారు. ఈ సమయంలో రమాప్రభ, రాజబాబు బయట ఎవరికి కనపడకపోవడంతో వీరిద్దరూ ఏమైపోయారు? అంటూ రకరకాల పుకార్లు బయలుదేరాయట.
రాజబాబుతో శ్రీదేవి డ్యూయెట్
రాజబాబు హీరోగా నటిస్తే హీరోయిన్స్ గా నటించిన వారిలో విజయనిర్మల, వాణిశ్రీ, శ్రీదేవి వంటి హీరోయిన్లు ఉన్నారు. ఇక రాజబాబు, శ్రీదేవి విషయానికొస్తే 1975 లో ‘దేవుడు లాంటి మనిషి’ అనే సినిమాలో రాజబాబు శ్రీదేవి కలిసి నటించారు. ఇదే సినిమాలో కష్ణ, మంజుల హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలోనే రాజబాబు సరసన శ్రీదేవి ఒక డ్యూయెట్ చేసింది. నిజానికి ఇది శ్రీదేవికి మొట్టమొదటి డ్యూయెట్ కావడం విశేషం. ఈ రకంగా రాజబాబు సరసన నటించిన హీరోయిన్స్ లిస్ట్‌లో శ్రీదేవి కూడా నిలిచిపోయింది.
వరుసగా ఏడు ఫిలింఫేర్ అవార్డులు
రాజబాబు జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులతో పాటు ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందాడు. చెన్నై ఆంధ్రా క్లబ్బు వారు వరుసగా ఐదు సంవత్సరాలు… రోలింగ్ షీల్డుని ప్రధానం చేసారు. అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందాడు.
రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు.
ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించే వాడు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్తినిచ్చిన బాలకష్ణను సత్కరించాడు. హాస్యనటుడు బాలకష్ణ నటన కోసం పాతాళ భైరవి ఎన్నోసార్లు చూశానని చెప్పేవాడు రాజబాబు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో డా.శివరామకష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేటలో భూమి ఇచ్చాడు. అంతే కాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు. దాని పేరుకూడా ఆయన పేరు మీదే….రాజబాబు జూనియర్ కళాశాలగా ఉంది.
రాజబాబు మహాకవి శ్రీశ్రీ తోడల్లుళ్ళు
తనదైన బక్కపలచని రూపంతో నవ్విస్తూ నవ్వుల రారాజు గా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన రాజబాబు, మహాకవి శ్రీశ్రీ తోడల్లుళ్ళు. శ్రీశ్రీ భార్య సరోజకు రాజబాబు అర్ధాంగి లక్ష్మీ అమ్ములు సోదరి. అలాగే గాయని రమోల కూడా రాజబాబు భార్యకు తోబుట్టువు. రాజబాబుకు ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేశ్ బాబు. అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు తమ్ముళ్ళలో చిట్టిబాబు, అనంత్ ఇద్దరూ హాస్యనటులుగా రాణించారు.
తన చుట్టూ ఉన్నవారిని సదా నవ్విస్తూ కవ్విస్తూ సాగిన రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 మహా శివరాత్రి రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదేరోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని మథర్ థెరెసా ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రిలోనే 1983 ఫిబ్రవరి 14న కన్నుమూశారు.
రాజబాబు కొడుకులు అమెరికాలో కోట్లాధిపతులు
రాజబాబు 1965లో లక్ష్మి అమ్మలుని వివాహం చేసుకున్నాక వారికి నాగేంద్ర బాబు, మహేష్ బాబు ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే రాజబాబు చిన్న వయసులోనే చనిపోవడంతో రాజబాబు భార్య లక్ష్మీ పిల్లలిద్దరిని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. చదువులు పూర్తి అయిన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా అమెరికాకు వెళ్లిపోయి అక్కడే నివాసం ఉంటూ సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలను పెట్టుకోవడంతో పాటు, ఇండియాలో కూడా కోట్ల విలువ చేసే ఆస్తులను కూడ పెట్టుకున్నారు. ప్రస్తుతం మనం ప్రతిరోజు వాడుతున్న ‘జిపిఆరేస్’ సిస్టమ్ వారు తయారుచేసిందే. అమెరికాలో వారి కంపనీ తరుపున రోజుకి ఐదు గంటలు అక్కడ పోలీసుల తరుపున కూడా పనిచేస్తున్న రాజబాబు కొడుకులు అమెరికాలోని కోట్లాధిపతులలో వారు ఉండడం విశేషం.
– పొన్నం రవిచంద్ర, 9440077499