నేడు కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌?

Rajagopal Reddy, Vivek into Congress today?– ఢిల్లీకి బయలుదేరిన నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ చెందిన సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి వివేక్‌ వెంకటస్వామి బుధవారం కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిసింది. అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెబుతు న్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ సమావేశమై కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.బుధవారం ఢిల్ల్లీలో కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ) కమిటీ సమావేశమవుతున్నది. అందులో కాంగ్రెస్‌ రెండో జాబితాకు తుది రూపం ఇవ్వనుంది. అంతకు ముందుగానే రాజగోపాల్‌, వివేక్‌ కాంగ్రెస్‌లో చేరితేనే రెండో జాబితాలో పేరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు లేదా ఎబ్బీనగర్‌ టికెటు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. వివేక్‌కు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. మునుగోడు సీటును ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి తదితరులను ఒప్పించుకోవాలని రాజగోపాల్‌రెడ్డికి అధిష్టానం సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పాల్వాయి స్రవంతితో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడే క్రమంలో కొంత అసహనానికి గురైనట్టు తెలిసింది. ఎట్టకేలకూ ఆయన రాకను అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. చలమల మాత్రం ఫోన్లో అందుబాటులోకి రావడం లేదు. అయినా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. గత కొంత కాలంగా రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కొనసాగింది. దసరా పండుగ రోజు దీనిపై రోజంతా మీడియాలో చర్చ నడిచింది. ఎట్టకేలకూ వారి చేరికపై స్పష్టత వచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన వారు…బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారంతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ గ్రాఫ్‌ రోజు రోజూకు పడిపోతున్నది. ఆ పార్టీలో ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తమకు కలగానే మిగిలిపోతోందనేది వారి భావన. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన ఓటమి పాలైన రాజగోపాల్‌రెడ్డి…తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ సభలు, సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. మోడీ సభలకు కూడా గైర్హజరయ్యారు. వివేక్‌ కూడా పార్టీ నేతలతో ముభావంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌, ఈటల రాజేందర్‌, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు వారికి బుజ్జగించారు. ఎన్నికలకు సంబంధించిన కొన్ని కీలక పదవులు కూడా ఇచ్చారు. అయినా వారిలో అసంతృప్తి మంటలు చల్లారాలేదని తెలిసింది. ఇప్పటికే విజయశాంతి బహిరంగంగానే పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ మాత్రం పైకి గంభీరంగా కనిపిస్తున్నా …హుజురాబాద్‌లో మాత్రం ఆయనకు ఎదురుగాలి వీస్తోందని తెలిసింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడంతో ఆయన బయటపడ్డారు. వచ్చేఅసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పరాభవం తప్పదనే ప్రచారం జరుగుతున్నది. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ కూడా ఈటలపై రివర్స్‌ గేర్‌ వేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయనపై పోటీకి బీఆర్‌ఎస్‌ బలమైన నేతను (ఇప్పటికే పాడి కౌశిక్‌రెడ్డిని మార్చే అవకాశం ఉందని సమాచారం) బరిలోకి దించి ఆయన ఓడించాలని భావిస్తున్నది. తద్వారా ఈటలను ఇటూ గజ్వేల్‌నూ, అటు హుజురాబాద్‌లోనూ ఓడించేందుకు అధికార పార్టీ పావులు కదుపుతున్నది.