– రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య
నవతెలంగాణ పాల్వంచ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రజకులను ఆదుకోవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య కోరారు. సోమవారం తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక సహకార సంఘాలు పైన అవగాహన సదస్సు పాల్వంచలో ముదిగొండ రాంబాబు అధ్యక్షతన చిటికన ముసలయ్య స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర వెనుకబడి ఉన్నారని, కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రజకులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రజక ఫెడరేషన్ ఏర్పడి 40 సంవత్సరాలు దాటిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫెడరేషన్ కి పాలకవర్గాన్ని నియమించకుండా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఫెడరేషన్‌కు అనుబంధంగా 4000 సహకార సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని వాటితో పాటు నూతనంగా ప్రతి గ్రామంలో, పట్టణంలో సొసైటీలను ఏర్పాటు చేసుకున్న వాళ్లందరికీ ప్రభుత్వం బిసి కార్పొరేషన్ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. రజకులపై జరుగుతున్న సామాజిక కుల వివక్షత, దాడులు, దౌర్జన్యాలు అరికట్టి ప్రత్యేక రక్షణ చట్టం అందించాలని తెలిపారు. రజక వృత్తిదారులకు ఉపాధి నిమిత్తం ప్రతి ఒక్కరికి పది లక్షల ఆర్థిక సహకారం ప్రభుత్వం ఇస్తానని తెలిపిందని, మోడ్రన్ దోబీగాట్లు నిర్మాణానికి ప్రతి జిల్లాకు రూ.10 కోట్లతో అభివృద్ధి పరుస్తామని ప్రభుత్వం తమ ఎన్నికల హామీలో తెలిపారని వాటన్నిటిని సత్వరమే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సదస్సు తీర్మానించిందని తెలిపారు. నూతన రజక సహకార సంఘాల నిర్మాణం పైన ఈ సదస్సులో అవగాహన కల్పించడం కోసం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి హాజరై మాట్లాడారు. జిల్లాలో స్థానిక సమస్యలపైన జిల్లా ప్రధాన కార్యదర్శి చిటికెన ముసలయ్య మాట్లాడుతూ ఇప్పటికీ రజక వృత్తిదారుల ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్లల్లో జీవిస్తున్నారని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక చోట్ల రజక వృత్తిదారులకు కేటాయించబడ్డ మాన్యం, ఇనాము భుములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రజకుల భూములకు పట్టాలిచ్చి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాస్, శివ కుమారి, యాదగిరి, రామ తులసి, సత్తెనపల్లి విజయలక్ష్మి పాల్గొన్నారు.