జైపూర్ : రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో ఒక బావిలో 18 ఏండ్ల దళిత యువతి మతదేహం లభ్యం కావటం సంచలనం రేపింది. మృతదేహాన్ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక రోజు తర్వాత పోలీసులు ఈ విషయంలో హత్య, సామూహిక లైంగికదాడి కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో పోలీసుల వ్యవహారశైలిపై ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు తొలుత ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. బాధితురాలి మతదేహం గురువారం హిందౌన్ నగరంలోని బిల్‌పాడా రహదారిలోని బావిలో లభ్యమైన విషయం విదితమే. మృతురాలిని కరౌలిలోని మోహన్‌పురా గ్రామ నివాసిగా గుర్తించారు. సదరు యువతి నీటిలో మునిగి చనిపోయినట్టు తెలుస్తున్నదనీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) కింద అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.