రాజస్థానీ చిత్రం

రాజస్థానీ చిత్రం రాజపుత్‌ల రాజ్యాలున్న ప్రదేశం రాజస్థాన్‌. వీరు యుద్ధ వీరులు. వీరు క్రీ.శ. 11వ శతాబ్దంలో ఇస్లాములు క్రీ.శ.16వ శతాబ్దంలో మొగలుల దాడులను ఎదుర్కొన్నారు. క్రీ.శ. 1527లో బాబర్‌ చేతిలో మేవార్‌ రాజు మహారాణా సాంగా యుద్ధంలో వీరగతి పొందాడు. మొగలుల అధికారం పెరిగింది. అంబర్‌ (జైపూర్‌) రాజు రాజా భార్‌మల్‌, తన కూతురు జోధాని అక్బరుకిచ్చి వివాహం చేశాడు. ముందు ఈ రాజు, ఆ తరువాత చాలామంది ముఖ్యులు అలా తమ బిడ్డలని మొగలు రాజాల కిచ్చి వివాహం చేశారు. మొగలు ఆస్థానంలో ముఖ్యకార్య నిర్వహణలో రాజపుత్‌లు పనిచేశారు. అందువల్ల వారి వస్త్రధారణ, అలంకార వ్యవహారాలు వీరూ నేర్చుకున్నారు. మొగలు ఆస్థానం వదిలిన కొంతమంది చిత్రకారులు వీరి ఆస్థానాలల్లో చేరారు. అందువల్ల ఆ చిత్రకారులు కొన్ని మొగలు చిత్ర శైలిని ఈ ఆస్థానాలకూ తెచ్చారు.
ఏది ఏమైనా రాజపుత్‌ ఆస్థానాలలో చిత్రకళ ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. మొగలు శైలి నుంచి వేరుగా, ఇది రాజస్థానీ చిత్రం అని తేలికగా గుర్తించే పద్ధతిలో వారి చిత్రానికి ఒక గుర్తుంపు తెచ్చారు ఈ రాజులు. భారతదేశంలోకి ఇస్లాములు, మొగలులు రాక ముందు వున్న జైన పద్ధతి లేదా పశ్చిమ భారతీయ చిత్ర పద్ధతినే వీరు అవలంభించారు. ‘చౌరపంచాశిక’ అనే చిత్ర గ్రంథం గురించి ఇంతకు ముందే మనం మాట్లాడాం. ఇందులో జైన పద్ధతిలో పెద్దవిగా, ముందుకు పొడుచుకు వచ్చిన కళ్లు, పక్కకు తిరిగి చూపే ముఖాలు, కొస తేలిన వస్త్రాల అంచులూ కనిపిస్తాయి. రాజస్థానీ చిత్రకళ ఈ పద్ధతినే ఆధారం చేసుకుని ముందుకు సాగింది. వీరు గాఢమైన రంగులు ఉపయోగించి, ప్రాంతీయ తలపాగాలు, వారివారి వస్త్రధారణ స్పష్టంగా చిత్రించారు. కొంత ప్రాంతీయ జానపద కళల ప్రభావమూ కనిపిస్తుంది. వీరు ఎక్కువగా భాగవతం, మహాభారతం, రామాయణం, దేవీమహత్యం, రాధాకృష్ణ శృంగార సాహిత్యం మీద ఆధారపడి చిత్రాలు వేశారు. అలాగే ’12 మాసాలు’, ‘రాగమాల’ సంగీత రాగాల విషయాలనూ చిత్రించారు. ఇంతెందుకు వీరు భారతీయ సంస్కృతి, సాహిత్యం వెలికి తెచ్చే చిత్రాలు వేశారు. వీరి చిత్రాలకు, మొగలు చిత్రాలకు ఉన్న తేడా ఏమిటంటే మొగలు చిత్రంలో వారి రాజులను భగవంతుడి లాగానో, రాజుల గురించే విషయాలను చిత్రిస్తూ, అదే నిజమనిపించేలా చిత్రించారు. రాజస్థానీ చిత్రం ఊహా చిత్రం. మనసులోనున్న భక్తి, ప్రేమ భావాలకు రూపం దిద్దిన చిత్రాలివి. మొగలుల, దక్కన్‌, ఇస్లామ్‌ చిత్రాల శైలి రాజస్థానీ శైలిలో కలగలిపి విషయం, భావం మాత్రం భారతీయ పురాణ ఇతిహాసాలు. ఈ భావ ప్రకటనలో మరో పద్ధతి నుండే మద్దతు తీసుకోవటమే కానీ, భావప్రకటన మారదు. రాజస్థానీ చిత్రంలో మరో విషయమేమిటంటే, రాజస్థానీ చిత్రాలన్నీ ఇదే పద్ధతిలో ఉండటం వల్ల ‘ఇది రాజస్థానీ’ చిత్రం అని ఎంత సులభంగా గుర్తించవచ్చో, అంతే సులభంగా రాజస్థాన్‌లోని ఏ ప్రాంతానిది ఏ చిత్రం అని కూడా మనం చిత్రం చూసి గుర్తించవచ్చు. వారి కట్టు, తీరు, చిత్ర శైలి ఆయా ప్రాంతాలకు గుర్తుగా చిత్రిస్తారు ఈ ఆస్థాన చిత్రకారులు. భారతీయ చిత్రకళకు రాజస్థానీ చిత్రం, భారతీయ సాహిత్యం, సంస్కృతికి గుర్తుగా అలాగే ఆర్భాటం కంటే భావ ప్రకటన ముఖ్యం అని చెప్పక చెప్పినట్టుంటాయి. రాజస్థానీ చిత్రాలలో చిత్రించిన మరో విషయం ప్రసిద్ధి కెక్కిన ప్రేమకథలు, సాహిత్యంలోని జంటలు, ఢోలా-మారు, సోహినీ-మహీవాలి, నల-దమయంతి, లైలా-మజ్ఞూ వంటి కథలు కూడా.
మేవార్‌ : వీరు బాబర్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయిన రాణా సాంగా వంశస్థులు. వీరు మొగలుల అధికారం ఒప్పుకొనలేదు. అక్బరు రణథంబోర్‌ కోటని ఆక్రమించినప్పుడు అప్పటి రాజు రాణాప్రతాప్‌సింగ్‌ అడవులలోకి పారిపోయాడు. ఆ తరువాత రాజైన అమర్‌సింగ్‌ క్రీ.శ. 1614లో జహంగీర్‌కి లొంగిపోయాడు. జహంగీర్‌ అతనికి ఎన్నో బహుమానాలిచ్చి ఆహ్వానించాడు. మధ్యలో వీరు చావంద్‌ అనే ప్రదేశంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకున్నప్పుడు, అక్కడ కూడా చిత్రకళ వేయించారు. నిసారుద్దీన్‌ చితెరా (చిత్రకారుడు) క్రీ.శ. 1605లో రాగమాల చిత్రాలను చిత్రించాడు. ఇతను మొగలు దర్బారు నుండి వచ్చినా మేవారు చిత్రకళ రీతి అలవరచుకున్నాడు. అందులోని మాల్కోస్‌ రాగాన్ని చిత్రించిన తీరు చూస్తే అది పశ్చిమ భారత, జైన చిత్రకళ శైలిని అవలంభించారు అని తెలుస్తుంది. రాజు లేదా ప్రముఖుడు ఒక ఆసనం మీద కూర్చుని వుండగా, అటు ఇటూ వింజామరలు విసిరే స్త్రీలు, మరోపక్క ఈ రాగం ఆలపిస్తున్న సంగీతకారులు, రాగం ఆనందిస్తున్న ఒక జింక చిత్రించబడింది. ఇది తెల్లవారు ఝామున పాడే రాగం. చిత్రించిన అందరి వస్త్రాలు కొసలుతేలి వుంటాయి. సాహబ్దీన్‌ అనే చిత్రకారుడు నసీరుద్దీన్‌ లాగానే మొగలు చిత్రప్రావీణ్యుడు. ఇతను క్రీ.శ. 1628లో మరో రాగమాల చిత్రాల సంపుటి వేశాడు. ఇది మరిన్ని చక్కటి రంగులతో మరింత వృద్ధి చెందిన చిత్రాలు. ఇతని చిత్రాలు 17 వ శతాబ్దపు మేవార్‌ చిత్రాలకు ఉదాహరణ అయ్యాయి. మహలు నిర్మాణం చిత్రించి, చిత్రాన్ని భాగాలుగా విభజించేటట్టు చూపిస్తారు. ఒక్కో వైపు కిటికీలో ఒక్కొక్కరిని చిత్రించి, వారి మధ్య సంభాషణ జరుగుతున్నట్టు చూపిస్తారు. ఎత్తైన మేడ, మధ్యలో పారేనది, చెట్లు, జలజీవరాశులు, పూలతో విరబూసిన తీగలు, గుల్‌మెహర్‌ పూల చెట్లు, ఆరావళీ పర్వతాల వాతావరణాన్ని చూపిస్తారు. మేవార్‌ చిత్రంలో, ప్రతి తీగ, ఆకులు గుబురుగా చిత్రించడం వలన చూసేకొద్దీ ఇంకా ఎన్నో అర్ధాలు దాగి వున్నాయి అనిపించే అందమైన చిత్రం ఇది.
క్రీ.శ. 1652 నుండి 1680 వరకూ రాజ్యం చేసిన ఇక్కడి రాజు రాజ్‌సింగ్‌, మొగలు రాజు ఔరంగజేబు అధికారం ఒప్పుకోలేదు. ఇతని కాలంలోనే క్రీ.శ. 1671లో శ్రీనాథ్‌జి విగ్రహాన్ని మధుర నుండి ఈ రాజ్యంలోని నాథ ద్వారానికి మార్చబడింది. నాధ ద్వారా వల్లభా భార్య పద్ధతిలో కృష్ణ భక్తి స్థానంగా మారింది. శ్రీనాథ్‌జి లేదా బాలరూపంలోని కృష్ణుడి సేవలు ఇక్కడి ముఖ్య పూజ, దర్శన విధానాలు. అందుకు తగ్గట్టు విగ్రహం వెనుక చిత్రించి వేలాడదీసే చిత్రపటాలు గొప్ప జోరు పుంజుకుని ఎన్నో చిత్రాలు చిత్రించబడ్డాయి. వీటి ‘పిఛవాయి’లు అంటారు. అంటే విగ్రహం వెనుక దేవుడి సేవలను సూచించే చిత్రపటాలు. క్రీ.శ.1761 – 73 వరకు రాజైన ఆరీ సింగ్‌ కాలంలో సరైన ప్రోత్సాహం లేక మేవార్‌ – ఉదయపూర్‌ వదిలి వెళ్లి పోయారు చిత్రకారులు.
బూందీ – కోటా : బూందీని వృందావతి అని కూడా అంటారు. క్రీ.శ. 1554 నుండి 1585 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన సురజాన్‌ సింగ్‌ మొగలు సామంతుడు. క్రీ.శ.1569 నుండి ఇతనికి రాజారావుగా బిరుదు ఇచ్చి, బనారస్‌ వద్ద చునాడ్‌లో ఒక రాగమాల చిత్రాల సంపుటి చిత్రించారు. అది చిత్రించిందీ మొగలు పరంపరలోని షేక్‌ హసన్‌, షేక్‌ అలీ, షేక్‌ హతీమ్‌. వీరంతా సయ్యద్‌ అలీ ఖవాజా అబ్దుసమాద్‌ శిష్యులు. కానీ ఈ చిత్రాలను వీరు బూందీ కోటా వారి రాజస్థాని శైలిలోనే చిత్రించారు. గుండ్రటి ముఖాలు, నిర్మాణాలలో బిళ్లల వంటి కట్టడాలు, ఆకుపచ్చ పచ్చిక బయళ్లు చిత్రించడం ఇక్కడి పద్ధతి. గాఢమైన రంగులు దిద్దడం, సాహిత్యం, కవిత్వంలా చిత్రం దిద్దడం అన్నీ రాజస్థానీ దర్బారుల చిత్రకళ పద్ధతి. ఇక్కడి చంబల్‌నది వద్ద వున్న చిక్కటి అడవిలో జరిగే రాజుల వేట కూడా చిత్రించారు. క్రీ.శ.1819 నుండి 1827 వరకు రాజ్యం చేసిన మహారావ్‌ కిషోర్‌సింగ్‌, కప్పులేని పల్లకిలో కూర్చొని దసరా సంబరాలకు వెళ్లుతున్న దృశ్యంలో, ఆయనతో పాటు ఎంతో మంది దర్బారీలు, తూటాలు వాయించే వాద్యగాళ్లు, ఘీంకరిస్తున్న ఏనుగు, ఆటలాగే కోతులు, గుర్రాలు, దూరాన దసరా మంటలకు గురికాబోయే రావణుడు, రాక్షసుల బొమ్మలు… అది ఎంతో హడావుడిగా వున్న ఊరేగింపని తెలియజేస్తుంది. క్రీ.శ.1830లో చిత్రించిన మరో చిత్రం రాజు శ్రీనాథ్‌జీ, నాథద్వారాలో దర్శనానికి వెళ్లిన దృశ్యం. దూరంగా గుడి ఆవరణ, రాజుని చిత్రించిన ఆ ఆకారాలు పెద్దగానూ, ద్వారం బయట నిలుచుని వున్న పరిచారకులు, ఏనుగులు, మనకు దగ్గరగా వున్నా చిన్నగా చిత్రించబడ్డాయి. ఇందులో మందిరమూ, రాజు దర్శనం ముఖ్యం కాబట్టి దూరంగా వున్నా పెద్దగా చిత్రించారు. ఇదే వైవిధ్యం రాజస్థానీ చిత్రాలకూ మొగలు చిత్రాలకూ.
ఒక చిత్రం వెనకాల, క్రీ.శ. 1781 లో వేసినది, అఖీరామ్‌ అనే చితెరాకు ఒకటవ ఉమేద్‌సింగ్‌, అతనిని ప్రశంసిస్తూ 4000 రూపాయలు, ఒక గుర్రం 5 జతల బంగారు గాజులు ఇచ్చారు. ఇంకోచోట ముసావిర్‌ అనే చితెరాకి 1000 రూపాయలు, ఒక జత బంగారు గాజులు, అతని చిత్రాన్ని ప్రశంసిస్తూ ఇవ్వబడ్డాయి అని రాసి వుంది.
కిషన్‌గఢ్‌ : కిషన్‌సింగ్‌, జోధ్‌పూర్‌ రాజకుమారుడు, క్రీ.శ. 1609లో గుండాలో అనే సరస్సు వద్ద కోట కట్టి క్రీ.శ.1609 నుండి 1615 వరకు రాజ్యం చేశాడు. ఇక్కడి దర్బారులో వేసిన చిత్రాలలో ఈ సరస్సు కనిపిస్తుంది. ఈ సరస్సు మధ్యలో తెల్లటి మహలు కట్టాడు. దానికి పడవలో వెళ్లాలి. ఆ సరస్సులో వర్షం నీరు నిండి, కలువలు పూసి, పక్షులు చేరిన అందాలని చిత్రాలలో చూపిస్తారు. ఈ రాజులు పుష్టిమార్గాన్ని అనుసరించిన కృష్ణభక్తులు. క్రీ.శ. 1748 – 57 వరకు రాజ్యం చేసిన సావంత్‌సింగ్‌ స్వయంగా కవి. రాధాకృష్ణుల ప్రేమ, శృంగారం మీద మనోరధమంజరి, రసిక రత్నావళి, బిహారిచంద్రిక అనే కవితలని క్రీ.శ 1723 – 54 మధ్య రాశాడు. గుడి ఉత్సవాలు, ఊరేగింపుల మీద కూడా ఇతను రాసినవి, ఉత్సవాలలో పాడతారు. తను స్వయంగా చిత్రకారుడు కూడా. బానిథాని అనే గొప్ప గాయనిని అభిమానించి ప్రేమించాడు. బ్రిజ్‌భాషలోనూ రసిక బిహారి అని తన పేరు పెట్టుకుని కవితలు రాశాడు. చివరిదశలో అన్నీ వదిలేసి వెళ్లి మధుర – బృందావనంలో సమయం గడిపాడు.
ఇక్కడి చిత్రాలు ఒక ప్రత్యేక అందం సంతరించుకుని వుంటాయి. పొడవైన నాజూకు శరీరాలు, వారి కదలికలు చిత్రిస్తుంటే ఏదో నృత్యంలోనో, నాటకంలోనో నిమగమై ఉన్నట్టు కనిపిస్తాయి చిత్రాలు. గీత గీసినట్టుండే ముక్కులు, చెంపకు చారెడు మీనాల వంటి కళ్లతో హుందాగా వుంటాయి మానవాకారాలు. బానిథాని గాయని ఆధారంగా రాధ చిత్రాలు చిత్రించారని ఒక ఊహ. రాధాకృష్ణుల శృంగారం, వారి నౌకా విహారం, రాజుని కృష్ణుడిగా చూపిస్తూ చిత్రించడం ఇక్కడి చిత్రాల ప్రఖ్యాతి. కొంతమంది రాజు వేట దృశ్యాలు, పోట్రేటు చిత్రాలనూ చిత్రించుకున్నారు. ఈ దర్బారు, మొగలు దర్బారు నుండి బయటకు వచ్చిన కళాకారులని ఆకర్షించింది. భవానిదాస్‌, అతని కొడుకు దాల్‌చంద్‌, బంధువు కళ్యాణదాస్‌ ఇక్కడే పనిచేశారు. సురధజ్‌ ములరబ్‌ కొడుకులు, మనుమలు, మునిమనుమలు… తరతరాలుగా ఇక్కడే పనిచేశారు.
జైపూర్‌: గోడలపై ఫ్రెస్కో చిత్రాలు గీయడం ఇక్కడి కళాకారుల ప్రత్యేకత. ముందుగా సున్నపుపూత పూసి ఆపై చిత్రాలు గీస్తారు. ఈ రాజులు మొగలుల ఆధీనంలో చేరి చుట్టుపక్కలరాజుల కలహాల నుండి తప్పించుకున్నారు. క్రీ.శ. 1699 నుండి 1743 వరకు రాజ్యం చేసిన సవాయి జైసింగ్‌ క్రీ.శ. 1727 లో జైపూర్‌ పట్టణ నిర్మాణం చేవాడు. క్రీ.శ.1778 నుండి 1803 వరకు రాజ్యం చేసిన సవాయి ప్రతాప్‌సింగ్‌, కవి వైష్ణవ భక్తుడు, భక్తి సాహిత్యం రాయించాడు. తను కృష్ణుడి లాగా వేషం వేసుకుని రాసమండలం కోలాటమాడాడు. చిత్రాలలో ఇతనినీ కృష్ణుడిలా చిత్రించారు.
జోధ్‌పూర్‌ : ఇది మార్వాడ లేదా మేరుగా గుర్తించబడుతుంది. వీరి రాజ్యం క్రీ.శ. 13వ శతాబ్దంలోనే మొదలైంది. క్రీ.శ.1459లో రావ్‌ జోధా కట్టించిన మెహరాన్‌ గఢ్‌కోట ప్రసిద్ధి చెందినది. ఇక్కడ జైన వ్యాపారులు క్రీ.శ. 15వ శతాబ్దంలో చిత్రగ్రంథాలను రాయించారు. 7 రాగాల, రాగమాల చిత్రాలతో చిత్రించిన సంపుటి మొగలుల పూర్వపు చిత్రం చౌరపంచాశిక శైలిలో చిత్రించబడింది. ఇందులో జానపదకళల శైలి కనిపిస్తుంది. గుండ్రటి నుదురు, పొడవాటి కళ్లు, కొనతేల్చిన ముక్కులు చిత్రించడం ఇక్కడి ప్రత్యేకత.
బికనేర్‌ : వీరు మొగలు చక్రవర్తులతో సంబంధాలు పెట్టుకున్నారు. వారి ఆస్థానంలో పెద్ద కారోభారాలు నిర్వహించారు. కరణ్‌సింగ్‌ క్రీ.శ.1650లో అలీరజా అనే చిత్రకారుడితో లక్ష్మీనారాయణులు వైకుంఠంలో విరాజమానులై ఉన్నట్టు చిత్రం వేయించుకున్నాడు. ఇది తన పూజామందిరం కోసం చిత్రించుకున్నాడు. ఇందులో కొన్ని మొగలు చిత్ర లక్షణాలు కనిపిస్తాయి.
మాల్వా : ఇక్కడి చిత్రాలు చౌరపంచాశిక శైలికి దగ్గరగా వుంటాయి. మధ్యభారతం, బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన ఈ శైలి చిత్రాలు చక్కటి డిజైన్‌, ప్రాంతీయ వస్త్ర డిజైన్లను చిత్రించడం చూడవచ్చు. మానవ ఆకారాలు జానపద కళలు చిత్రించిన శైలిలో కనిపిస్తాయి. ఇక్కడ ఎంతో చిత్రకళ జరిగింది.

– డా||యమ్‌.బాలామణి, 8106713356