– టాప్ సీడ్ ఆంటోన్సెన్‌పై గెలుపు
– కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ 2024
న్యూఢిల్లీ: కెనడా ఓపెన్‌లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్ సీడ్, డెన్మార్క్ షట్లర్ ఆండర్స్ ఆంటోన్సెన్‌పై మెరుపు విజయం సాధించాడు. అన్‌సీడెడ్ ప్రియాన్షు రజావత్ 21-17, 17-21, 21-19తో ఆంటోన్సెన్‌ను చిత్తు చేశాడు. మూడు గేముల ఉత్కంఠ మ్యాచ్‌లో తొలి గేమ్ నెగ్గిన ప్రియాన్షు ముందంజ వేశాడు. రెండో గేమ్‌లో ఆంటోన్సెన్ పైచేయి సాధించినా.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో క్లాస్ చూపించాడు. గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌లో టాప్ సీడ్‌కు చుక్కలు చూపించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో విరామ సమయానికి ప్రియాన్షు 10-11తో వెనుకంజ వేశాడు. బ్రేక్ తర్వాత పుంజుకుని 11-11తో స్కోరు సమం చేసినా.. 16-16 వరకు ఆధిపత్యం చేతులు మారుతూ ఉత్కంఠ రేపింది. కీలక సమయంలో 17-16తో ముందంజ వేసిన రజావత్ అదే జోరు కొనసాగించాడు. 21-19తో మూడో గేమ్‌తో పాటు సెమీఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల డబుల్స్‌లో మూడో సీడ్ ట్రెసా జాలి, పుల్లెల గోపీచంద్ జోడీ నిరాశపరిచింది. క్వార్టర్‌ఫైనల్లో 18-21, 21-19, 16-21తో మూడు గేముల మ్యాచ్‌లో చైనీస్ తైపీకి సెమీస్ బెర్త్‌ను కోల్పోయింది.