నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌

నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌– సంస్మరణ సభలో సీనియర్‌ ఐపీఎస్‌లు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన ఐపీఎస్‌ అధికారి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీపీ రాజీవ్‌ రతన్‌ అని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో రాజీవ్‌రతన్‌ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న రాష్ట్ర హౌం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌ మాట్లాడుతూ.. రాజీవ్‌ రతన్‌ ఇంత ఆకస్మికంగా మరణిస్తాడని తాను ఊహించలేదనీ,ఆయన ఐపీఎస్‌ అధికారిగా పోలీసు శాఖ ద్వారా ప్రజలకందించన సేవలు ఎన్నటికీ మరవలేమని అన్నారు. ముఖ్యంగా, పోలీసు శాఖలోని ఏ విభాగంలో పని చేసినా.. ఆ విభాగం పనితీరును మెరుగుపర్చటానికి పలు సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. చివరిగా, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా కాళేశ్వరంను సందర్శించి, అక్కడ ఎలాంటి అవకతవకలు జరిగాయనే విషయమై ప్రభుత్వానికి నివేదికను సమర్పించారని ఆయన అన్నారు. జైళ్ల శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. రాజీవ్‌ రతన్‌ నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన అధికారే గాక.. తాను విధి నిర్వహణ చేస్తున్న విభాగానికి వంద శాతం న్యాయం చేకూర్చే అధికారిగా కొనియాడారు.పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం. రమేశ్‌ మాట్లాడుతూ.. గతంలో ఈ విభాగం ఎండీగా పని చేసిన రాజీవ్‌ రతన్‌ పలు నిర్మాణాలను చేపట్టి ప్రభుత్వానికి ఆర్థిక దుబారా లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఈ విభాగంలో పని చేసిన ఇంజినీర్లకు చక్కటి దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్‌ పోలీసు అధికారులతో పాటు పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన అధికారులు, సిబ్బంది రాజీవ్‌ రతన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.