నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతు రుణమాఫీ పేరుతో రైతు బంధు పథకానికి స్వస్తి పలికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ హయంలో రైతాంగ సంక్షేమానికి రూ. లక్ష 20 వేల కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష లోపు పంట రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందికే మాఫీ చేయడమేంటని కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ మాఫీ చేసిన దానిలో కేవలం పావు శాతం మాత్రమే రేవంత్ సర్కారు చేసిందని తెలిపారు. లక్ష లోపు రుణమాఫీకి రూ. 19 వేల కోట్లు అవసరం కాగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6098 కోట్ల మాత్రమే మాఫీ చేసిందని పేర్కొన్నారు. జులై నెల సగం అయిపోయినా రైతు బంధు ఇంకా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. అధి కారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని విమర్శించారు. రూ. 31 వేల కోట్ల రుణ మాఫీలో కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమే చేశారని తెలిపారు. ఆగష్టు 15 లోపు 6 గ్యారం టీలు అమలు చేసి, మిగతా రూ. 25 వేల కోట్ల రుణ మాఫీ చేసి అప్పుడు రాజీనామా గురించి మాట్లాడాలని సూచించారు.