రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి మృతి

Rajendra Prasad's daughter Gayathri passed awayనవ్వుల రారాజు రాజేంద్రప్రసాద్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) కన్నుమూశారు. శుక్రవారం ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ గాయత్రి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులోనే రాజేంద్రప్రసాద్‌ కుమార్తె చనిపోవడం అత్యంత బాధాకరం. చిరంజీవి, వెంకటేష్‌, అల్లుఅర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సాయికుమార్‌ తదితరులు గాయత్రి పార్దీవ దేహాన్ని సందర్శించి, తల్లిగా భావించే కుమార్తెని కోల్పోయిన రాజేంద్రప్రసాద్‌కి ధైర్యం చెప్పారు.
అత్యంత బాధాకరం : చిరంజీవి
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ,’నా మిత్రుడు రాజేంద్రప్రసాద్‌ బిడ్డ కాలం చెందటం మనస్తాపానికి గురిచేసింది. నా మిత్రుడు ఈ బాధను ఎలా తట్టుకుంటాడు?, ఎప్పుడూ నవ్వించే అతన్ని ఎలా ఓదార్చాలి అంటూ బయలుదేరాను. తనకున్న బాధను దిగమింగుకుని తన వ్యక్తిత్వంతో భగవంతుడు చాలా పరీక్షలు పెడుతుంటాడు. అన్నింటిని తీసుకోగలగాలి అంటూ వేదాంతిలా మాట్లాడుతుంటే నాకు మరింత బాధ అనిపించింది. చిన్నవాళ్ళు కనుమరుగైతే పెద్ద వాళ్ళ బాధ వర్ణనాతీతం.నా మిత్రుడు ఈ విషాదం నుంచి కోలుకుని త్వరలో మళ్ళీ అందరినీ నవ్వించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి మృతికి నివాళి అర్పిస్తూ పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌, సాయి దుర్గ తేజ్‌ తదితరులతోపాటు పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. నేటి (ఆదివారం) ఉదయం 9.30లకు గాయత్రి అంత్యక్రియలు కూకట్‌పల్లిలోని కైలాసవాసంలో నిర్వహిస్తున్నట్లు రాజేంద్రప్రసాద్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.