దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహౌన్నతమైన వ్యక్తి రాజీవ్‌గాంధీ

– టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లిశంకర్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహౌన్నతమైన వ్యక్తి రాజీవ్‌ గాంధీ అని, దేశ భవిష్యత్తు కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. రాజీవ్‌ గాంధీ వర్థంతి సందర్భంగా షాద్‌నగర్‌ పట్టణంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్‌ శ్రేణులు నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ తరఫున స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లేడు చౌదర్‌ గూడ మండలానికి చెందిన ఏదిర గ్రామానికి చెందిన బుడ్డమల్ల సంగీత కొన్ని నెలల క్రితం పిడుగుపాటుతో చనిపోయిన కారణంగా ఆమెకు కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్వం ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండు లక్షల బీమా చెక్కును టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌, మండల పార్టీ అధ్యక్షుడు రాజు చేతుల మీదుగా సంగీత తల్లి బుడ్డమల్ల మనీలాకు 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ ఐటీరంగం అభివృద్ధి రాజీవ్‌గాంధీ చలవే అన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేస్తే, మతం ముసుగులో బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతూ దేశ అబివృద్ధిని మరిచిందన్నారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని 73, 74 అమెండ్మెంట్‌ ద్వారా పంచాయతీరాజ్‌ సంస్థలను బలోపేతం చేయడానికి కేంద్రం నుంచి గ్రామపంచాయతీలకు నేరుగా నిధులను పంపించే వ్యవస్థను ఆనాటి ప్రధానిగా రాజీవ్‌ గాంధీ చేసిన విషయాన్ని దేశంలో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థలు గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసిన గొప్ప మహనీయుడు రాజీవ్‌గాంధీ అని ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. సీఎం కేసీఆర్‌ గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడని అన్నారు. గ్రామాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు నేరుగా వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి రాష్ట్ర పాలన తీసుకువెళ్లారని విమర్శించారు. ప్రధాని మోడీ గ్రామ స్వరాజ్యం, ఫెడరలిజంకు తూట్లు పడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పిసిసి సభ్యులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ లు, ఆరు మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌ యూఐ, ఎస్సీ సెల్‌, ఎస్టీ సెల్‌, మైనార్టీ సెల్‌, మహిళా కాంగ్రెస్‌, కిసాన్‌ కాంగ్రెస్‌, బీసీసెల్‌, కాంగ్రెస్‌ అనుబంధాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.