– సీఎం రేవంత్‌రెడ్డి
– రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
నవతెలంగాణ-సిటీబ్యూరో
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. యువతలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఈ విగ్రహావిష్కరణ చేపట్టామన్నారు. రాజీవ్‌గాంధీ సేవలు మరువలేమని, దేశ సమగ్రతను కాపాడటంలో ఆయన ప్రాణం అర్పించారని కొనియాడారు. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. విగ్రహాలను ఏర్పాటు చేసేది వర్ధంతి, జయంతికి దండలేసి దండం పెట్టడానికి కాదన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే అది చూసే వారికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఓ పక్క సచివాలయం, మరోపక్క అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్‌పై ఎందరో త్యాగమూర్తుల విగ్రహాలు ఉన్నాయన్నారు. అయితే ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఒక లోటు ఉందని గుర్తించానని, అదే రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం అని తెలిపారు. ఈ రోజు ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నామంటే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ ప్రత్యేక శ్రద్ధ, కృషిని మరువలేమన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సోనియాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంత రావు, షబ్బీర్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు పాల్గొన్నారు.