రాజీవ్ గాంధీ యూత్ అంతర్జాల క్విజ్ కార్యక్రమంలో పాల్గొనాలి: సీతక్క


నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ యూత్ అంతర్జాల క్విజ్ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. శనివారం కొత్త నాగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ కాంపిటీషన్ సందర్భంగా యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రచార కార్యక్రమం నిర్వహించగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క హాజరై గోడపత్రిక ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ పోటీల్లో ములుగు నియోజకవర్గం నుండి యువత అధిక సంఖ్యలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నందు జరిగిన ప్రియాంక గాంధీ గారి యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు గల వారు మీ మొబైల్ నెంబర్ నుండి 7661899899 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వగా మీ నెంబరుకు లింక్ వస్తుంది. అట్టి లింకును క్లిక్ చేసి పూర్తి వివరాలు ఇచ్చేసి రిఫరల్ కోడ్ దగ్గర 1129 ఎంటర్ చేయగా మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు జూన్ 17 వరకు చేసుకోవచ్చని, అలాగే జూన్ 18 న అంతర్జాల పరీక్ష ఉంటుందని 60 ప్రశ్నలు, 60 నిమిషాల సమయం ఉంటుంది. ఇట్టి పరీక్షలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన మొదటి మహిళకు ప్రతి నియోజకవర్గం నుండి ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వబడును అని అలాగే మొదట 40 మందికి ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్ లాంటి బహుమతులు ఇస్తారని కాబట్టి యువత ములుగు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని, బహుమతులు గెలుచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కోరం రామ్మోహన్, ఈక శేషు, వంశీ, గ్రామ యూత్ అధ్యక్షులు గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.