రాజ్‌ కుమార్‌ పాల్‌ హ్యాట్రిక్‌

Rajkumar Paul hat trick– ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌
హాంగ్జౌ(చైనా): ఆసియా హాకీ ఛాంపియన్‌ట్రోఫీలో భారత్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకొని సెమీస్‌కు చేరింది. బుధవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో యువ స్ట్రయికర్‌ రాజ్‌కుమార్‌ పాల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిసాడు. దీంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ చైనా వేదికగా జరుగుతున్న హీరో ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 8-1గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను 3-0 తేడాతో మట్టికరిపించిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో జపాన్‌ను 5-1 తేడాతో చిత్తు చేసింది. తాజాగా మలేసియాపై ఘన విజయంతో సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఛాంపియన్‌ ట్రోఫీలో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. 16న సెమీస్‌, 17న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.
రాజ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌
మలేసియాతో మ్యాచ్‌లో రాజ్‌ కుమార్‌ పాల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించాడు. 3, 25, 33వ నిమిషాల్లో రాజ్‌ కుమార్‌ గోల్స్‌ చేశాడు. భారత్‌ తరఫున రాజ్‌ కుమార్‌తో పాటు అరైజీత్‌ సింగ్‌ హుండల్‌ 6, 39 నిమిషంలో, జుగ్‌రాజ్‌ సింగ్‌ 7వ నిమిషంలో, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 22వ నిమిషంలో, ఉత్తమ్‌ సింగ్‌ 40వ నిమిషంలో గోల్స్‌ కొట్టారు. మలేసియా సాధించిన ఏకైక గోల్‌ను అకీముల్లా అనువర్‌ 34వ నిమిషంలో సాధించాడు. ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా, పాకిస్తాన్‌లతో తలపడనుంది. కొరియాతో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 12న.. పాక్‌తో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 14న జరగనున్నాయి.