– సింగరేణి కార్మికుని వేషధారణతో అసెంబ్లీకి
– భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి ప్రాంతం నుంచి వచ్చాడు. తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తాను సింగరేణి కార్మికుల ప్రతినిధినంటూ కార్మికుల డ్రస్సు వేసుకుని, తట్ట, చెమ్మాస్ చేతిలో పట్టుకుని, లైట్‌తో కూడిన హెల్మెట్ పెట్టుకుని శాసనసభ ఆవరణలోకి శనివారం ఎంట్రీ ఇచ్చాడు. అందరి చూపూ తనవైపు తిప్పుకున్నాడు. అసెంబ్లీ ఆవరణలోకి రాగానే భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా? కాంగ్రెస్ నుంచి గెలుపొందిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్. తొలిరోజు తన వేషధారణతో అసెంబ్లీకి వచ్చి సింగరేణి కార్మికుల మనస్సు దోచేశాడు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ’25 ఏండ్ల నా సుదీర్ఘ పోరాటం ఫలించింది. సింగరేణి ప్రాంతం నుంచి కార్మికుల ప్రతినిధిగా అసెంబ్లీకి వచ్చా. వారి గౌరవం కాపాడుతా. గడీల పాలనకు చరమగీతం పాడి నాకు భారీ మెజార్టీ ఇచ్చిన సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు. సింగరేణి కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపెన్‌కాస్టులు ఇబ్బందికరంగా మారాయి. ఆ ప్రాంతమంతా కాలుష్యమైపోయింది. చుట్టూ నీళ్లున్నా కాలుష్యంతో తాగలేని పరిస్థితి ఉంది. అక్కడి వాతావరణంతో పెరాలసిస్, గుండెజబ్బులు, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో ప్రజలు చనిపోతున్నారు.
ఆ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడ పర్యా వరణం పునరుద్ధరించాలంటే వేల ఎకరాల్లో మొక్కలు నాటాలి. నేడు సింగరేణిలో కార్మికుల సంఖ్య ఏటేటా తగ్గిపోతున్నది.
యువతకు మేలు చేయాలి. సింగరేణి ప్రాంతంలో చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. నాకు సాధ్యమైనంత మేరకు నియోజకవర్గ ప్రజలకు, సింగరేణి కార్మికులకు మేలు జరిగేలా సింగరేణి కార్మికుల ప్రతినిధిగా అసెంబ్లీలో మాట్లాడుతా’ అంటూ భావోద్వేగంతో అన్నారు. అసెంబ్లీకి తన కుటుంబంతో కలిసి వచ్చారు.
ఎస్‌ఎల్‌బీసీ కాల్వ పొడిగింపు కోసం కృషి చేస్తా : కె.జయవీర్‌రెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ కాలువను మరో తొమ్మిది కిలోమీటర్లు పొడిగించేందుకు తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ శాసనసభ్యుడు కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు.
శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిన ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తన తాత, తండ్రిని ఆదర్శంగా తీసుకుని నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని హామీనిచ్చారు