ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు

Rajya Sabha elections on February 27– షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం
– 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నిక
– తెలంగాణ, ఏపీలో మూడేసి స్థానాలు ఖాళీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
త్వరలో ఖాళీకానున్న రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16, నామినేషన్ల ఉపసంహరణకు 20 చివరి తేది. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. కాగా ఏప్రిల్‌ మొదటి వారంలో 56 మంది సభ్యుల పదవీ కాలం పూర్తికానుంది. ఇందులో తెలంగాణ నుంచి మూడు స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు స్థానాలు ఖాళీకాబోతున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి పది మంది పదవీ విరమణ చేయనున్నారు. బీహార్‌, మహారాష్ట్రాల్లో ఆరు స్థానాల చొప్పున, పశ్చిమ బెంగాల్‌లో ఐదు, గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాల్లో నాలుగు స్థానాల చొప్పున, ఒరిస్సా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో మూడేసి చొప్పున, హర్యానా, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరఖండ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానం ఖాళీ కానుంది.
తెలంగాణ నుంచి వీళ్లే
తెలంగాణ నుంచి మొత్తం 7 రాజ్యసభ స్థానాలుండగా.. ప్రస్తుతం మూడు ఎంపీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌ రావు, వద్దిరాజు రవిచంద్రల పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగియ నున్నది. అయితే ఈ మూడు స్థానాలు బీఆర్‌ఎస్‌కు చెందినవి. అసెంబ్లీలో ప్రస్తుత సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్‌కు రెండు, బీఆర్‌ఎస్‌కు ఒక స్థానం లభించే అవకాశముంది. పదేండ్ల తర్వాత తొలిసారి తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ నుంచి వీళ్లే…
ఆంధ్రప్రదేశ్‌ నుంచి సిఎం రమేష్‌(బీజేపీ), కనకమేడల రవీంద్ర కుమార్‌(టీడీపీ), వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి(వైసీపీ)ల పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగియనుంది. ఏపీలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే మూడు స్థానాలను వైసీపీనే సొంతం చేసుకునే అవకాశముంది. ఇదే జరిగితే తొలిసారి రాజ్యసభలో టీడీపీ సభ్యుడు లేకుండా పోయే పరిస్థితి ఉంది.