మా ఇంటి రాఖీ పండుగ‌

Rakhi festival of our houseపండుగ అంటేనే.. ఓ అనిర్వచనీయ ఆనందం, ఓ ఆహ్లాదం, ఓ హరివిల్లు.. అన్నింటికీ మించి ఆ రోజును మన కోసమే మనం మనసారా వినియోగించుకునేందుకు దొరికే ఓ సెలవు దినం. రొటీన్‌కి భిన్నంగా పండుగ రోజులను మామిడి తోరణాలతో, కొత్త బట్టలతో, పిండి వంటలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆహ్వానించుకుంటాం.
భారతీయ సంస్కృతీ సాంప్రదాయం ప్రకారం విభిన్న పర్వదినాలు తరచుగా వస్తూ పోతూ అలరిస్తూ, ఆనందాన్ని పంచుతూనే ఉంటాయి..! అయినా సరే, ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే పండుగల కోసం క్యాలండర్‌ పేజీలని తిరగేస్తూ ఎదురుచూస్తూ ముందస్తుగానే ఇల్లు శుభ్రం చేసుకొని మాయాత్తమవుతాం..!
ఆయా ప్రత్యేక పండుగల వెనకున్న మత పరమైన మూలాలు, గాధలను, ప్రాంతాలను, సంస్కృతులను, ఆచార వ్యవహారాలను బట్టి మనం జరుపుకునే విధానాలు, తీరు తెన్నులు మారుతూ ఉంటాయి. కొన్నింటి వెనక చారిత్రక కారణాలైతే, మరికొన్ని పౌరాణికాలు, ప్రముఖుల జయంతులు, జాతీయతలు, దేశభక్తితో ముడిపడినవీ ఉంటాయి.
ఇప్పుడైతే అన్నాచెల్లెళ్లు అక్కాతమ్ముళ్ల నడుమ అనుబంధానికి చిహ్నంగా జరుపుకునే పండుగ అయిన రక్షాబంధన్‌ గురించి చెప్పుకుందాం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో రాఖీపౌర్ణమి, రాకెట్ల పున్నమిగా కూడా వ్యవహరిస్తారు. ఇది ప్రతీ సంవత్సరం శ్రావణ పౌర్ణమినాడు వస్తుంది.
రక్షాబంధన్‌ అంటే రక్షణ కోసం ఓ దారంతో సోదరుల మణికట్టుకు ముడివేసి మేలు జరగాలని కోరుకునేదని అర్ధం. ఈ పండుగని ప్రాచీన కాలం నుంచి జరుపుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నాయి.
పౌరాణిక గాథలను పరిశీలిస్తే బలమైన స్నేహానికి పేరుగాంచిన శ్రీకృష్ణుడు యుద్ధంలో వేలికి గాయమై రక్తమోడుతున్నప్పుడు, అతని సోదరి, ద్రౌపది తన చీర కొంగును చించి, వేలి గాయానికి కట్టి ఆదుకున్నట్లు, ఆమె ప్రేమకు గుర్తుగా శ్రీకష్ణుడు అట్టి ప్రేమని తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేసి, తర్వాత ఒక క్లిష్టమైన సమయంలో ద్రౌపదికి సహాయం చేయడం ద్వారా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడని అప్పటినుంచి ఈ పండుగ సోదర సోదరీమణులు అనుబంధానికి చిహ్నంగా వచ్చిందని ప్రతీతి.
అదే కాకుండా ప్రాచీన కాలంలో యుద్ధాలకు వెళ్లే వారి భర్తలకు, కుమారులకు, అన్నదమ్ములకు మహారాణులు, రాజమాతలు వీర తిలకం దిద్ది విజయంతో తిరిగి రావాలని కంకణధారణ చేసి పంపేవారని, బహుశా అదే కాలానుగుణంగా రక్షాబంధన్‌ పేరుతో.. ఈ విధంగా రూపాంతరం చెందినట్లు ఉంది.
మరో చారిత్రక ఘటనననుసరించి.. క్రీ.పూ 326లో గ్రీకు రాజు అలెగ్జాండర్‌ ప్రపంచ దేశాలపై దండెత్తుతూ భారతదేశానికి కూడా వచ్చాడు. అప్పటి భారత భభాగపు రాజు పురుషోత్తముడు. అతి వీర పరాక్రమవంతుడు అయిన పురుషోత్తముని ముందు అలెగ్జాండర్‌ ఓటమిపాలవుతాడని గ్రహించిన అతని భార్య రుక్సానా యుద్ధానికి ముందే పురుషోత్తముడిని సోదరుడిగా భావించి తన భర్తను కాపాడమని రాఖీ కట్టి మాట తీసుకుంటుంది. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం యుద్ధంలో అతడిని చంపకుండా వదిలేస్తాడు. ఆ విధంగా రాఖీతోనే ఆ యుద్ధం ముగిసిపోతుంది. అప్పటినుంచి రాఖీ పండుగని తోబుట్టువుల అనుబంధానికి, ప్రేమకు గుర్తుగా జరుపుకుంటున్నారని చెప్తారు.
కథలూ, గాథలు ఎన్నున్నా… తోడబుట్టిన వాళ్ల కోసమే వచ్చిన ఈ పండుగంటే అందరికీ ఇష్టమే..! ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్లిపేరుతో పుట్టింటికి దూరంగా వుంటారు కాబట్టి, ఇలాంటి సందర్భాలప్పుడన్నా తల్లిగారింట్ల అందరితో కలిసి, బాల్యాన్ని నెమరు వేసుకుంటూ గడపొచ్చని ఎదురు చూస్తారు..!
నేనైతే ఆగస్టునెల వచ్చిందంటే చాలు జెండా పండుగ కన్నా రాఖీ ఏ రోజంటూ క్యాలెండర్‌ తిప్పుతూనే ఉంటా. చిన్నప్పుడు మా బడి క్రాఫ్ట్‌ వర్క్‌ పీరియడులో మెరుపు దారాలు పూసలతో కలిపి అందమైన రాఖీ కూర్చి మొదటి ప్రైజ్‌ను కొట్టేసుకున్నా. రాఖీలను పూసలతో రంగుల దారాలతో కలిపి ఆకర్షణీయంగా తయారు చేయడం సజనాత్మకమైన పనే..!
ఓ నెల ముందు నుంచే పండుగ హడావుడి మొదలవుతుంది. ఏ షాపులో చూసినా రకరకాల డిజైన్లతో కూర్చిన, రంగురంగుల రాఖీలను వేలాడగట్టి అమ్ముతుంటారు ఆ విధంగా దుకాణాదారుల వ్యాపారం కూడా పెరుగుతుంది.
నా చిన్నప్పటి జ్ఞాపకం మా మేనత్త.. తన ప్రియమైన తమ్ముడు మా నాన్న కోసం ఊరంతా గాలించి, అన్నింటికన్నా పెద్ద సైజు, అందమైన రాఖీని కొని తెచ్చి ఎంతో ఆప్యాయంగా తమ్ముడి చేయికి కట్టి మురిసిపోయేది. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. ఆ దశ్యం కళ్ళముందే అపూర్వంగా కదలాడుతుంటుంది ఇప్పటికీ.
అవును… అప్పటి రాఖీలు విరబూసిన సూర్యకాంతి పువ్వుల్లా రంగుల స్పాంజీ కత్తిరించి వాటిపై చమ్కీలు అంటించి, అందంగా తయారుచేసే వాళ్ళు.. ఇప్పుడవే కాస్తా రూపుమారి చిన్న సిల్క్‌ దారాలకి రంగు రంగు మెరుపు పూసలని గుచ్చి మినీ సైజుకు తీసుకొచ్చారుగానీ, అప్పటి రాఖీయే చూడ ముచ్చటగా బాగుండేది.
రోజులు మారాయి, ఫ్యాషన్‌లూ మారాయి. వాటినిప్పుడు బంగారం, వెండి, ఇతర లోహాలతో బ్రాస్లెట్స్‌లా కూడా తయారు చేస్తున్నారు.
ఇక మా అమ్మ పుట్టింటికి వెళ్లి రాఖీ కట్టే వీలు లేక, సుదూరంగా ఉన్న వాళ్ళ తమ్ముళ్ల కోసం ప్రతీ సంవత్సరం పోస్ట్‌ ద్వారా పంపించి, ఫోన్‌లో మాట్లాడి సంబురపడుతుంది. ఆ పంపించే పని మాత్రం నాకే అప్పగిస్తుంది. అన్నట్టు నేనిప్పుడు వెళ్లి వాటిని పోస్ట్‌ చేయాలి.. సుమా!
ఇది ఆధునిక యుగం కదా, ఇక మా పిల్లలకైతే, విదేశాల్లోవున్న వాళ్ళ చెల్లె ఆన్లైన్‌ లోనే అక్షింతలతో పాటు నచ్చిన రాఖీలను బుక్‌ చేసి పంపుతుంది కనుక అవి అడ్వాన్స్‌గానే వచ్చి చేరుకుంటాయి. చెల్లెలి ఆనందాన్ని తెచ్చి పంచుతాయి.
ఈ పండుగ ఎంత కళనో.. ఏ బస్సులో చూసినా, మరే షాపులో చూసినా..ఏ రోడ్ల పైన అయినా అంతా ఆడబిడ్డల హడావుడే.! ఈ ఒక్క రోజు వీధులన్నీ సీతాకోకలు విహరిస్తున్న తోటలా ఉంటాయి.
ఇప్పుడు మేం ఎక్కడున్నా సరే, రేపటి పండక్కి చెల్లే, నేనూ పొద్దున్నే వెళ్లి కరీంనగర్‌లో ఉంటున్న మా అన్నయ్యింట్లో వాలిపోమూ!! నాన్న జ్ఞాపకాలతో అమ్మ ఎలాగూ అక్కడే ఉంది. ఉదయాన్నే తమ్ముడు వాళ్ళని కూడా పిలిచి, హారతి పట్టి, రాఖీ కట్టి అందరం కలిసి ఆనందంగా గడపాలి కదా!
అన్నట్టు మీకో ముచ్చట చెప్పాలి. నేను అపురూపంగా దాచుకున్న నా చీరల కలెక్షన్స్‌లో సగానికి పైగా రాఖీ పండగ సందర్భంగా మా సహోదరులు ప్రేమతో ఇచ్చిన కానుకలే..!
అందుకే పండుగలన్నింటిలో కెల్లా నాకు రాఖీ పండగంటేనే ఇష్టం..! ఈ సందర్భంగా సమస్త సోదర సోదరీమణులందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలతో.. రేపటి నుంచి మళ్లా వచ్చే పండక్కోసం ఎదురు చూస్తూ ఉంటా..!

– నాంపల్లి సుజాత, 9848059893.