ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

నవతెలంగాణ-గోవిందరావుపేట : మండల వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలను మహిళలు సోమవారం ఎంతో గౌరవంగా ప్రేమతో జరుపుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చి పోయే బస్సుల ద్వారా కార్ల ద్వారా ఇతర వాహనాల ద్వారా ఆడపడుచులు తమ పుట్టింటికి చేరుకొని తమతోబుట్టువులకు అన్నలకు తమ్ముళ్లకు అక్కలు చెల్లెమ్మలు రాఖీలు కట్టి స్వీట్లు తినపించారు. అంతేకాక రాఖీ కట్టిన చెల్లెమ్మలకు అన్నయ్యలు పుట్టింటి కానుకగా నూతన వస్త్రాలను అందించారు. ఒక అపూర్వమైన ప్రేమ ఘట్టంగా రాఖీ పౌర్ణమి ప్రతి కుటుంబంలోనూ నిలిచిపోయింది. నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి సీతక్క మండలంలోని పలువురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులకు రాఖీ కట్టి ప్రేమానురాగాన్ని చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటకృష్ణ యూత్ కాంగ్రెస్ నాయకుడు పెండెం శ్రీకాంత్ లు సీతక్కతో రాఖీలు కట్టించుకుని చీరలను కానుకగా అందించారు. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో మహిళలను పూర్తిస్థాయిలో బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.