నవతెలంగాణ – కంఠేశ్వర్
అన్నాచెల్లెళ్ల మధ్య ఆత్మీయ అనురాగ అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తోంది. కష్ట సుఖాల్లో తోడుగా ఉంటామని భరోసానిచ్చే పండికే ఈ రక్షాబంధన్. ఈ పండుగకు కులమతాలు, భేదాలు లేకుండా చిన్న పెద్ద తామర తారతమ్యం లేదు. మనతో పేగుబంధం పంచుకొని పుట్టిన అక్కాచెల్లిళ్లకే కాదు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సోదరికీ అండగా నిలవాలని, మన కర్తవ్యమని విశిష్టమైన సంస్కృతి చెబుతోంది రక్షాబంధన్ పండుగ. రాఖి పండగ వచ్చిందంటే చాలు దేశమంతటా సోదరమయంగా మారిపోతుంది. కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉంటూ జీవితాంతం ఆనందంగా జీవించాలని ఈ పండుగ అంతరార్థం. చెల్లి అన్నకు,అక్క తమ్ముడికి రాఖీ కట్టి ఎల్లప్పుడూ సోదరుడు అండగా ఉండాలని, తాను అన్నకు జీవితాంతం తోడుగా ఉండాలని కోరుకుంటారు. రాఖీ పండగ సందర్భంగా సోమవారం నిజామాబాద్ తో పాటు పల్లెలు, పట్టణాలు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులతో బస్టాండ్, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఒకరోజు ముందే ప్రయాణం మొదలుపెట్టారు. జిల్లాలోని పలు సెంటర్ల వద్ద భారీగా రాఖీ దుకాణాలు, స్వీట్ల దుకాణాలు వెలిశాయి. ఈసారి రాఖీలకు భలే డిమాండ్ పలికింది.