
నవతెలంగాణ-సూర్యాపేట : సోదర, సోదరీమణుల మధ్య బంధాన్ని గౌరవించే ఒక ముఖ్యమైన పర్వదినంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి రక్ష బంధన్ పండుగ జరుపుకుంటున్నారని డీసీఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. రాఖి పండుగ సందర్భంగా సోమవారం స్థానిక తన నివాసంలో ముస్లిం సోదరి 43వ వార్డ్ కు చెందిన మీర్ పర్వీన్ అక్బర్ ఆయనకు రాఖి కట్టిన సందర్భంగా మాట్లాడారు.ఇది సోదరి తన సోదరుడికి రాఖీ కట్టడం, అతని రక్షణ కోసం ప్రార్థించడమే కాకుండా, కుటుంబంలో బంధాలను బలోపేతం చేసే పండుగ అని కొనియాడారు. సోదరుడు కూడా తన సోదరిని జీవితంలో అన్ని విధాలా రక్షించడానికి మాట ఇవ్వడం ఈ సంప్రదాయంలో ప్రధాన అంశం అని పేర్కొన్నారు.సాంప్రదాయంగా, ఈ పండుగ కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే కాకుండా, స్నేహితుల మధ్య కూడా జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ పండుగ వివిధ ప్రాంతాల్లో విభిన్న రీతిలో జరుపుకుంటారని చెప్పారు. రాఖీ కట్టడం కేవలం సోదరులే కాకుండా, సామాజిక స్నేహ సంబంధాలను కూడా బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు.ఈ పండుగకు సంబంధించిన ఒక చారిత్రక అంశంలో రాణి కర్నావతి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ముఘల్ చక్రవర్తి హుమాయూని కి రాఖీ పంపినట్లు చెబుతారని తెలిపారు. ఈ సంఘటన రాఖీ పండుగ అర్థాన్ని, భౌతిక రక్షణకు మించిన భావనగా విస్తరించిందని పేర్కొన్నారు. అనంతరం తన భార్య 13 వ వార్డు కౌన్సిలర్ వట్టే రేణుక తో కలిసి తనకు రాఖి కట్టిన సోదరి కి నూతన వస్త్రాలు పెట్టి సత్కరించారు.